వృద్ధురాలు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలు అదృశ్యం

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

వలిగొండ : మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు ఊదరి నర్సమ్మ అదృశ్యమైంది. ఈ నెల 11న ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎంత వెతికినా నర్సమ్మ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. నర్సమ్మ ఆచూకీ తెలిసిన వారు 87126 62484 87126 62810 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

గుర్తుతెలియని మహిళ

మృతదేహం లభ్యం

వేములపల్లి : మండలంలోని అన్నపరెడ్డిగూడెం గ్రామ శివారులో సాగర్‌ ఎడమ కాల్వలో బుధవారం గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహం కాల్వలో కొట్టుకొస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వేములపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని లేదా 87126 70190, 87126 70808 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

బుజిలాపురంలో

వ్యక్తి మృతదేహం లభ్యం

మోత్కూర్‌ : మోత్కూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు అడ్డగూడూరు మండలం గోవిందపురానికి చెందిన పొట్టపాక మల్లేష్‌(35)గా గుర్తించారు. మల్లేష్‌ తన భార్య, కుమారుడితో విడిపోయి సుమారు పదేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై తరచూ రోడ్లపై తిరుగుతుండేవాడని పేర్కొన్నారు. బుజిలాపురంలో ఉంటున్న తన చిన్నమ్మ గుగ్గిళ్ల ఎల్లమ్మ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని, మంగళవారం ఉదయం కూడా ఆమె ఇంటికి వచ్చినట్లు తెలిపారు. సరైన ఆహారం తీసుకోకపోవడంతో మల్లేష్‌ మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

కనగల్‌ : పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. కనగల్‌ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్‌ మండలం బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన బొంత అంజయ్యకు అదే గ్రామానికి చెందిన నకిరేకంటి రాములు కుటుంబానికి కొన్నేళ్లుగా బాట పంచాయితీ జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం గ్రామ శివారు వ్యవసాయ భూముల వద్ద రాములు అంజయ్యతో ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో చేతిలో ఉన్న కల్లు గీసే కత్తితో అంజయ్యపై రాములు దాడి చేయడంతో అంజయ్య ఎడమ భుజానికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి 108 వాహనంలో అంజయ్యను నలగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అంజయ్య భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement