బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

భూదాన్‌పోచంపల్లి : బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామానికి చెందిన పోశమోని నందువర్ధన్‌ పోచంపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడి అన్న చరణ్‌ కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో పాఠశాలకు, కళాశాలకు వచ్చేపోయేవారు. బుధవారం బస్సు వెళ్లిపోవడంతో గ్రామం నుంచి బైక్‌పై లిఫ్ట్‌ అడిగి జూలూరు వరకు వచ్చారు. తిరిగి జూలూరు వద్ద అలీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ చిలువేరు శివకుమార్‌ బైక్‌పై పోచంపల్లికి వెళ్తుండగా.. లిఫ్ట్‌ అడిగి అతడి బైక్‌ ఎక్కారు. జూలూరు శివారులోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరి కిందపడటంతో కాళ్లు విరిగి నుజ్జునుజ్జయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వారిని అంబులెన్స్‌లో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చౌటుప్పల్‌ మండలం తేరట్‌పల్లికి చెందిన లారీ డ్రైవర్‌ బొడ్డుపల్లి శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువతి అదృశ్యం.. కేసు నమోదు

హుజూర్‌నగర్‌ : పట్టణానికి చెందిన యువతి అదృశ్యమైంది. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ పట్టణంలోని పీర్ల కొట్టం బజారులో నివాసముంటున్న బత్తుల మానస బుధవారం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా మానస ఆచూకీ లభించకపోవడంతో దీంతో ఆమె తల్లి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెరువులో మునిగి వ్యక్తి మృతి

మోతె : పశువులను తోలుకొచ్చేందుకు చెరువులోకి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం నామవరం గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నామవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చిట్యాల ఉప్పయ్య (40) తన పశువులను గ్రామ శివారులో మేపుతుండగా.. అవి నీటి కోసమని చెరువులోకి వెళ్లాయి. ఆ పశువులను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఉప్పయ్య చెరువులోకి దిగగా.. ఆయన కట్టుకున్న లుంగీ నీటిలో కాళ్ల మధ్య చిక్కుకోవడంతో ఈత రాక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement