రేట్ల పెంపునకు నిర్ణయించాం
సాక్షి, యాదాద్రి : భూ సేకరణకు ప్రధాన అడ్డంకిగా మారుతున్న భూముల విలువల పెంపు కోసం యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూమి మార్కెట్ విలువల సవరణ కమిటీ చర్చలు ప్రారంభించింది. వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయం చేకూర్చేలా మార్కెట్ విలువు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. భూములు, గజాల విలువ పెంచడం ద్వారా నిర్వాసితులకు అవార్డు, ఆర్బిట్రేషన్‌లో ఎక్కువ పరిహారం ఇచ్చే వీలుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లకు ఇది వర్తించదు. కొత్తగా వచ్చే భూసేకరణ నోటిఫికేషన్లకు వర్తిస్తుంది.
తాజాగా భూముల విలువల పెంపు
ప్రభుత్వం వ్యవసాయ, వాణిజ్య భూముల విలువను ఈ సంవత్సరం పెంచింది. గత ప్రభుత్వంలో 2022, 2021, 2015లో భూముల విలువలను సవరించారు. అయితే భూసేకరణ సందర్భంగా పరిహారం తక్కువగా వస్తుందని బాధితులు ఆందోళనలకు దిగుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.కోట్లు పలుకుతున్న భూములకు రూ.లక్షల్లో పరిహారం ఇవ్వడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియను అడ్డుకోవడంతో ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, జిల్లా రిజిస్టార్‌ల అధ్వర్యంలో భూమి మార్కెట్ విలువ సవరణ కమిటీ (అనామలీ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బేసిక్ వాల్యూమీద అదనపు రేట్లు పెంచడానికి నిర్ణియించింది. బాధితులకు భూ సేకరణ పరిహారం మరింత ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఎంత పెంచారు అనేది ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత తెలియనుంది.
అనామలి కమిటీ పరిశీలన
భూసేకరణ నోటిఫికేషన్ సమయంలో నిర్దేశించిన భూమి విలువ తక్కువగా ఉంటే, ల్యాండ్ అక్విజిషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం అనామలి కమిటీ ద్వారా రేట్లను సమీక్షించి, రివైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ రేట్లు పెరిగితే దాని ఆధారంగా అవార్డు పాస్ చేసే సమయంలో కమిటీ పెంచిన రేటు ఆధారంగా ఎక్కువ పరిహారం బాధితులకు లభిస్తుంది. భూమి మార్కెట్ విలువలు సవరించిన తర్వాత పెంచిన భూసేకరణ అవార్డు పరిహారం తక్కువని భావిస్తే, బాధితులు ఆర్బిట్రేషన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
కమిటీలో సభ్యులు ఎవరంటే..
భూముల రేట్లను సమీక్షించేందుకు అనామలీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గ్రామీణ ప్రాంతాల్లో అదనపు(రెవెన్యూ) కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీఓ, డీఐజీ (రిజిస్ట్రేషన్ల శాఖ), సబ్ రిజిస్ట్రార్, స్థానిక అధికారులు సభ్యులుగా ఉంటారు. అలాగే మున్సిపాలిటీల్లో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్, హెచ్‌ఎండీఏ అఅధికారులు, డీఐజీ (రిజిస్ట్రేషన్ల శాఖ), తహసీల్దార్ సంబంధిత అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
నోటిఫికేషన్ సమయానికే మార్కెట్ విలువలను పెంచి రివైజ్డ్ రేట్లు అమలు చేయడం ద్వారా పరిహారం పెరిగి బాధితులకు, రైతులకు ఆర్థికంగా న్యాయం జరగనుంది. జిల్లాలో తాజాగా రైల్వే మార్గాల విస్తరణ, రోడ్ల వెడల్పు, ఆధునీరకరణ, సాగునీటి కాలువల భూసేకరణ, ఇంకా వివిధ ప్రాజెక్టులకు మరికొన్ని ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే భూములు, ఓపెన్ ప్లాట్లకు తాజా భూముల సవరణ వర్తిస్తుంది.
ఫ భూముల విలువల సవరణకు కార్యాచరణ
ఫ కొత్తగా భూ సేకరణకు అడ్డంకులు రాకుండా చర్యలు
ఫ రేట్లను సమీక్షించేందుకు అనామలీ కమిటీ ఏర్పాటు
ఫ బేసిక్ విలువ పెంపునకు నిర్ణయం
రానున్న రోజుల్లో భూసేకరణ సందర్భంగా పరిహారం మరింత పెంచి ఇవ్వాలనే లక్ష్యంతో అనామలి కమిటీ రేట్లను సమీక్షిస్తుంది. నోటిఫికేషన్ వేసే నాటికి ఉన్న రేట్లను పెంచడానికి కమిటీ నిర్ణయించింది.
– కె.వెంకారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ


