కనగల్ : నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో జన్మించిన బుచ్చిరెడ్డికి తొలి నుంచి సాహిత్యమంటే మక్కువ. ఆయన రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకం నుంచి కంప్యూటర్ పిల్లలం గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఆయన ఒకరు.
రెండు దశాబ్దాలుగా బాల సాహిత్య సేవ
గత 28 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన.. రెండు దశాబ్దాలకు పైగా బాలసాహిత్యానికి విశేష సేవలందిస్తున్నారు. ఇంటర్మీడియట్ నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో సాహిత్యం వైపు దృష్టి సారించారు. చిన్నారుల కోసం సులువుగా అర్థమయ్యే రీతిలో 350కి పైగా కథలు, కవితలు, గేయాలు రాశారు. గతంలో మండల రీసోర్స్‌పర్సన్‌గా పనిచేసినప్పుడు వినూత్న విద్యా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్షా అభియాన్) ఆధ్వర్యంలో నల్లగొండ నుంచి వెలువడిన జాబిల్లి పిల్లల మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడిగా కూడా సేవలందించారు. విద్యార్థులకు ముందుగా మాతృభాషలో అవగాహన కల్పిస్తే, ఆంగ్లాన్ని సులువుగా నేర్చుకోగలరన్నది ఆయన అభిప్రాయం.
విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్దపీట
ప్రౌఢ సాహిత్యంలో ధీరుల మొగసాల, డమరుకం, మాలిమి తదితర పుస్తకాలు రాసిన ఆయన.. బాల సాహిత్యంలో మొలకలు, బంతి పూలు, బహుమతి, మార్గదర్శి వంటి పిల్లల కథల పుస్తకాలను వెలువరించారు. వీటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా 70కి పైగా ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు ఉచితంగా అందించారు. హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ విద్యార్థుల్లో రచనా సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన కథలతో మాదారం మందారాలు అనే సంపుటిని వెలువరించేందుకు సిద్ధమయ్యారు. పిల్లలు రాసిన అంశాలు మొలక, బాల చెలిమి వంటి పత్రికల్లో అచ్చయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా దాతల సహకారాన్ని కూడగట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
అక్షరంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. బాల సాహిత్యంతో సరిహద్దులు దాటి గుర్తింపు పొందారు కనగల్ మండలం చిన్న మాదారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు(స్కూల్ అసిస్టెంట్) కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. ఆయన రచించిన కంప్యూటర్ పిల్లలం అనే బాల గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం..
ఈ విద్యా సంవత్సరానికి గాను అక్కడి నాలుగో తరగతి తెలుగు బాలభారతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక చేసింది.
ఫ రెండు దశాబ్దాలుగా బాల
సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
ఫ ఆయన రాసిన కంప్యూటర్
పిల్లలం గేయానికి అరుదైన గుర్తింపు
ఫ మహారాష్ట్రలోని నాలుగో తరగతి తెలుగు బాలభారతిలో
పాఠ్యాంశంగా ఎంపిక


