● రక్త నమూనాల సేకరణ
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జ్వరాలు కలవరపెడుతున్నాయి. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు గత రెండు రోజులుగా జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. విద్యార్థులను పాఠశాల సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. అంతేకాకుండా పాఠశాలలో మరికొందరు విద్యార్థులు కూడా జ్వరం, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు జ్యోత్స్న, వైద్య సిబ్బంది పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ జ్యోత్స్న అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొట్టిన లారీ
ఫ యువకుడి దుర్మరణం
చౌటుప్పల్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం కై తాపురం గ్రామం వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం మాజీ సర్పంచ్ భద్రి లింగయ్య కుమారుడు భద్రి రాహుల్ అలియాస్ రాము(22) వరంగల్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్ సైతం చేస్తున్నాడు. కాగా ధర్మోజిగూడెం గ్రామంలో గురువారం బోనాల వేడుకలు ఉండటంతో రాహుల్‌ను ఊరికి రమ్మని కుటుంబ సభ్యులు పిలిచారు. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన రాహుల్ అక్కడ తన మిత్రుడి వద్ద ద్విచక్ర వాహనాన్ని తీసుకొని స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం కై తాపురం గ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పరారు కాగా.. స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
కుటుంబ సభ్యులతో
గొడవపడి వ్యక్తి ఆత్మహత్య
భువనగిరి : కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇండ్ల కుమార్(33)కు ఐదేళ్ల క్రితం తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బస్వాపురం రిజర్వాయర్ ముంపు కింద కుమార్ కుటుంబానికి చెందిన భూములు కోల్పోవడంతో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో కుమార్ తరచూ మద్యం తాగుతూ దానికి బానిసయ్యాడు. డబ్బుల వృథా విషయమై కుమార్‌తో గొడవ పడిన అతడి భార్య పిల్లలతో కలిసి ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయినప్పటికీ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గురువారం కూడా కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.


