సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఆగస్టు 26న అదృశ్యమైన ఓ వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం రాఘపట్నం గ్రామానికి చెందిన గంట వెంకటరామయ్య (42) రాడ్ బెండింగ్ పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చి అదృశ్యమయ్యాడు. వెంకటరామయ్య తనకు పరిచయస్తుడైన బుల్ల బాలుతోపాటు మరో తొమ్మిది మందితో కలిసి సూర్యాపేటకు వచ్చి ఉంటున్నారు. గతనెల 26న ఉదయం సుమారు 9.30 గంటలకు తాళ్లగడ్డ ప్రాంతంలో అందరూ కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మిగిలిన వారంతా తమ గదికి తిరిగి వెళ్లగా, వెంకటరామయ్య మాత్రం వారితో వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించలేదు. పరిచయస్తులు, బంధువులు పరిసర ప్రాంతాలు, తెలిసిన ప్రదేశాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సూర్యాపేట టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వెంకట రామయ్య ఆచూకీ తెలిసిన వారు, ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే సూర్యాపేట టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం ఫోన్ 9948691481, 8712680134 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


