పత్తిలో సమతుల్య పోషకాలు కీలకం | - | Sakshi
Sakshi News home page

పత్తిలో సమతుల్య పోషకాలు కీలకం

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

గరిడేపల్లి: వర్షాధారంగా సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. పత్తిలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పత్తిని పొందాలంటే సమతుల్య పోషక యాజమాన్యం ఎంతో కీలకం. మొక్కకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో, సరైన సమయంలో అందించకపోతే మొక్క ఎదుగుదల, పూత, పిందె, కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, చివరికి దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలపైనా రైతులు శ్రద్ధ చూపాలి.

ప్రధాన పోషకాల నిర్వహణ

● పత్తి పంటకు సాధారణంగా ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్‌ అందేవిధంగా సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును పాటించాలి. నేల పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదులను సర్దుబాటు చేసుకోవడం మరింత సమర్థవంతమైన విధానం.

● భాస్వరం పంట ప్రారంభ దశలోనే వేర్ల అభివృద్ధికి అవసరమవుతుంది. అందువల్ల సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం మోతాదును సాధారణంగా చివరి దుక్కిలో లేదా విత్తిన 15 రోజులు లోపు వేయాలి. విత్తిన తర్వాత పైపాటుగా భాస్వరం వేయడం సాధారణంగా అవసరం ఉండదు.

● నత్రజని పత్తి మొక్కలో శాఖల అభివృద్ధి, ఆకుల పెరుగుదల, పూత, పిందె, కాయల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. నత్రజనిని అధికంగా వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి, పూత–కాయల ఏర్పాటులో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సిఫార్సు చేసిన నత్రజని మోతాదును ఒకేసారి కాకుండా పంట దశను బట్టి విడతలుగా అందించాలి.

● పొటాష్‌ మొక్కలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, నీటి ఎద్దడి వంటి వివిధ ఒత్తిడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. వర్షాధార పత్తిలో పొటాష్‌ను నిర్లక్ష్యం చేయకుండా సిఫార్సు చేసిన మోతాదులో అందించడం ముఖ్యం.

● నత్రజని–పొటాష్‌ను విడతలుగా బీటీ పత్తిలో సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్‌ మోతాదులను 20, 40, 60, 80 రోజులలో నాలుగు విడతలుగా అందించవచ్చు. ఎకరాకు ప్రతి విడతలో సుమారు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయడం ద్వారా అవసరమైన నత్రజని, పొటాష్‌ను అందించవచ్చు. ఈ విధంగా విడతలుగా అందించడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుపడి, మొక్కకు అవసరమైన దశలో పోషకాలు అందే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత, నేల స్వభావం, పంట స్థితిని బట్టి ఎరువుల నిర్వహణలో మార్పులు చేసుకోవాలి.

ద్వితీయ, సూక్ష్మ పోషకాల లోపాలు, యాజమాన్యం

జింక్‌ లోపం

ఒకే పంటను పదేపదే సాగు చేయడం, చౌడు ప్రభావం ఉన్న నేలలు, భాస్వరం ఎరువులను అధికంగా ఉపయోగించడం వంటి పరిస్థితుల్లో జింక్‌ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. జింక్‌ లోపం వల్ల ఆకులు చిన్నవిగా, ముడతలుగా మారి, కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ లోపాన్ని నివారించేందుకు 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

మెగ్నీషియం

నేలలో పొటాష్‌ అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో మెగ్నీషియం అందుబాటు తగ్గి లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ పోషక లోపం వలన ముదురు ఆకుల అంచులు మారుతాయి. తరువాత ఆకులు ఎరబ్రడి ఎండి రాలిపోతాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగు మారక ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని నివారించేందుకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్‌ ను కలిపి వారం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

బోరాన్‌

సున్నం అధికంగా ఉన్న నేలల్లో, అలాగే నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితుల్లో బోరాన్‌ లోప లక్షణాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. బోరాన్‌ లోపం వల్ల పూత, పిందె, చిన్న కాయలు రాలడం, పూలు చిన్నవిగా మారడం, మొక్క ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లోపాన్ని నివారించేందుకు లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్‌ కలిపి ఒకటి లేదా రెండు సార్లు 7–10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

వాతావరణ పరిస్థితుల్లోనూ

పోషక యాజమాన్యం ముఖ్యం

పత్తిలో పోషకాల లభ్యత, మొక్క వాటిని గ్రహించి వినియోగించే సామర్థ్యంపై వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. నీటి ఎద్దడి, బెట్ట పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమలో మార్పులు వంటి పరిస్థితుల్లో మొక్కలో సహజ శారీరక ప్రక్రియలు దెబ్బతిని పత్తిలో కూడా, పూత, పిందె, చిన్న కాయలు రాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొలంలో నీటి లభ్యతను మెరుగుపరచడం, సాధ్యమైన చోట రక్షక నీటిపారుదల అందించడం, నేలలో తేమను సంరక్షించే చర్యలు చేపట్టడం ముఖ్యం. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో పత్తిలో పూత, కాయ రాలడాన్ని తగ్గించేందుకు ప్లానోఫిక్స్‌ (10 పిపియం) ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి ఒక మి.లీ చొప్పున కలిపి 10– 15 రోజులో రెండుసార్లు పిచికారి చేయాలి.

● పూత, పిందె దశలో మొక్కకు తగిన పోషకాలు అందించేందుకు అవసరాన్ని బట్టి యూరియా లేదా ఈఅ్క వంటి నీటిలో కరిగే ఎరువులను 20 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయవచ్చు. లేదా మార్కెట్లో లభ్యమయ్యే నానో యూరియా, నానో డీఏపీ వంటివి కూడా పిచికారి చేసుకోవచ్చు.

● బెట్ట పరిస్థితుల్లో మొక్కల ఒత్తిడిని కొంతవరకు తగ్గించేందుకు 13:0:45 (పొటాషియం నైట్రేట్‌) లేదా 19:19:19 వంటి నీటిలో కరిగే ఎరువులను 5 నుండి 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పంట దశ, వాతావరణ పరిస్థితులను బట్టి ఆకులపై పిచికారీ చేయవచ్చు.

ఫ పోషక యాజమాన్యంపై కేవీకే శాస్త్రవేత్త సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement