భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి చెరువు పర్యాటక కళను కోల్పోయి బోసిపోతోంది. గడచిన ఐదు నెలలుగా చెరువులో బోటింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం 2025 జూన్ 2న రాయగిరి వద్ద మినీ శిల్పారామాన్ని ప్రారంభించారు. ఇందులో పిల్లల ఆట వస్తువులు, ఫొటో పాయింట్లు, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 18 మంది సామర్థ్యం గల పెద్ద బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోట్లను అందుబాటులోకి తెచ్చారు.
మరమ్మతుల్లో పెద్ద బోటు
ఐదు నెలల క్రితం 18 మంది ప్రయాణించే పెద్ద బోటు సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైంది. రిపేర్ కోసం హైదరాబాద్ తరలించారు. ఇప్పటివరకు తిరిగి తీసుకురాలేదు. మరోవైపు ఇటీవల చెరువులో నీటిమట్టం బాగా తగ్గడంతో నలుగురు ప్రయాణించే స్పీడ్ బోటు సేవలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం ఒక్క పెడల్ బోటు మాత్రమే అరకొరగా నడుస్తోంది.
కళ తప్పిన శిల్పారామం
గతంలో ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకుల కోసం కూచిపూడి, భరతనాట్యం, కథకళి వంటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం మే 10వ తేదీ తర్వాత నుంచి ఈ ప్రదర్శనలను కూడా నిలిపివేశారు.
వారాంతాల్లో రద్దీ ఉన్నా తప్పని తిప్పలు
శిల్పారామానికి సాధారణ రోజుల్లో 250 నుంచి 300 మంది, శని, ఆదివారాల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి 500 – 600 మంది వరకు సందర్శకులు వస్తుంటారు. వినోదం కోసం వచ్చిన పర్యాటకులు బోటింగ్, నృత్య ప్రదర్శనలు లేకపోవడంతో కేవలం పిల్లల ఆట స్థలానికే పరిమితమైంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెద్ద బోటును అందుబాటులోకి తెచ్చి, సాంస్కృతిక ప్రదర్శనలను పునరుద్ధరించాలని సందర్శకులు కోరుతున్నారు.
ఫ చెరువులో ఐదు నెలలుగా నిలిచిన బోటింగ్
ఫ మరమ్మతులకు గురైన పెద్ద బోటు.. మూలనపడ్డ స్పీడ్ బోటు
ఫ వారాంతాల్లో నృత్య ప్రదర్శనలకూ బ్రేక్


