దొంగలనే దోచుకున్నారు ! | - | Sakshi
Sakshi News home page

దొంగలనే దోచుకున్నారు !

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

చండూరు : చండూరు మార్కెట్‌ యార్డులో ధాన్యం దొంగతనం కేసులో 11 మందిని రిమాండ్‌ చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు చండూరు సీఐ టి. రాము తెలిపారు. ఈ కేసు వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చండూరు పట్టణానికి చెందిన తేలుకుంట్ల శ్రీనివాసులు మరొక భాగస్వామితో కలిసి కనగల్‌ మండలం కురంపల్లి గ్రామ శివారులో మహవీర్‌ రైస్‌ మిల్లు నిర్వహిస్తున్నాడు. వీరు 2025–26 సంవత్సరానికి గాను ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో 25వేల క్వింటాళ్లు చండూరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో నిల్వ చేశారు. దశలవారీగా ధాన్యాన్ని మిల్లుకు తరలించగా.. ఇంకా 13వేల క్వింటాళ్ల బియ్యం గోదాంలో ఉండాల్సి ఉంది. కానీ ఇటీవల గోదాం నుంచి ధాన్యం బస్తాలు బయటకు గుంజినట్లు ఆనవాళ్లు కనిపించడంతో లెక్క చూడగా 600 నుంచి 700 బస్తాల వరకు బియ్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 22న శ్రీనివాసులు చండూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దొంగతనం జరిగిందిలా..

ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగిళ్ల ఆంజనేయులు మార్కెట్‌లో ట్రేడ్‌ లైసెన్స్‌ హోల్డర్‌గా ఉంటూ చిరుధాన్యాలు అమ్ముతుంటాడు. అదేవిధంగా హమాలీగా కూడా పనిచేస్తుంటాడు. రెండు నెలల క్రితం నాగిళ్ల ఆంజనేయులుకు గోదాం తాళం దొరకగా.. రాత్రి సమయంలో చండూరుకు చెందిన బొమ్మోజు ప్రకాశ్‌, మెతరి నాగేష్‌తో కలిసి గోదాంలోని బియ్యాన్ని బొలేరో వాహనంలో సూర్యాపేటలోని మిల్లులకు అమ్మేవారు. చివరిసారిగా వారు ముగ్గురు ధాన్యం లోడ్‌ చేస్తుండగా చండూరుకు చెందిన దోటి వెంకన్న, అతడి అనుచరులు వేముల పవన్‌, దోటి శివ, భీమనపల్లి గణేష్‌, దోటి నరేష్‌, గండూరి మల్లేష్‌, బెత వెంకన్న, గోల్కొండ శేఖర్‌ కలిసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఎనిమిది మంది నాగిళ్ల ఆంజనేయులును బెదిరించి రూ.5లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మొత్తం 11మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం తెలిసిన ఓ మీడియా ఛానల్‌ ప్రతినిధి నల్ల స్వామి సివిల్‌ సప్లై అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అతడిపై కూడా నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ప్రస్తుతం నల్ల స్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి మొత్తం రూ.9.80 లక్షలు రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.

గతంలోనూ కేసులు

నిందితుల్లో మెతరి నాగేష్‌పై పోక్సో కేసు ఉందని, అదేవిధంగా వేముల పవన్‌, గండూరి మల్లేష్‌పై హత్యాయత్నం కేసులు, భీమనపల్లి గణేష్‌, దోటి నరేష్‌పై కొట్లాట కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసు ఛేదించిన ఎస్‌ఐ శివకుమార్‌, సిబ్బందిని ఎస్పీ అభినందినట్లు సీఐ తెలిపారు.

ఫ చండూరు మార్కెట్‌ యార్డులో ధాన్యం దొంగతనం చేసిన ముఠా గుట్టురట్టు

ఫ 11 మంది రిమాండ్‌, ఒకరు పరారీ

ఫ రూ.9.80 లక్షలు రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement