గంధమల్ల రిజర్వాయర్‌ పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

గంధమల్ల రిజర్వాయర్‌ పనులు ప్రారంభించాలి

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

రాజాపేట : గంధమల్ల రిజర్వాయర్‌ పనులు ప్రారంభించి ఆలేరు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి గంధమల్ల రిజర్వాయర్‌ కోసం శంకుస్థాపన చేసి 10 నెలలు గడిచినా నేటికీ భూసేకరణ పూర్తిచేయకపోవడంతో పనులు ప్రారంభించలేదన్నారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించి నీళ్ల ఐలయ్య అని పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యను కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ సందిల భాస్కర్‌గౌడ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చామకూర గోపాల్‌ గౌడ్‌, సర్పంచ్‌ పల్లె సంతోష్‌ గౌడ్‌, మాజీ సర్పంచ్‌లు గుంటి కృష్ణ, రామిండ్ల నరేందర్‌, ధర్మేందర్‌ సింగ్‌, గొడుగు రాజు, నాయకులు కొరుకొప్పుల వెంకటేశ్‌ గౌడ్‌, రెడ్డబోయిన రాజు, ఠాకూర్‌ భగత్‌ సింగ్‌, పాండవుల లక్ష్మణ్‌, లక్ష్మణ్‌నాయక్‌ పాల్గొన్నారు.

బస్సులను యథావిధిగా నడిపిస్తాం

భూదాన్‌పోచంపల్లి: దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పోచంపల్లికి వచ్చే నెల సెప్టెంబర్‌ నుంచి యథావిధిగా ఆర్టీసీ బస్‌సర్వీసులను నడిపిస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోమేనేజర్‌ సమత, డీఓ కవిత వెల్లడించారు. బస్సుల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పోచంపల్లికి చెందిన పలువురు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ను కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం ఆర్టీసీ అధికారులు పోచంపల్లికి వచ్చారు. నేతాజీ యువజన సంఘం వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని, మెట్రో బస్సుల స్థానంలో ఆర్డినరీ బస్సులను నడిపించాలని కోరగా అందుకు వారు అంగీకరించారు. వచ్చే నెల నుంచి ప్రతి అరగంటకు ఒకటి చొప్పున బస్సు సర్వీసులు నడిపేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సార బాలయ్య, వంగూరి పాండు, ఏలే హరిశంకర్‌, ముప్పడి శ్రీను, బోడ సత్యనారాయణ, కొంక సౌమ్య, బండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఎంజీయూలో ‘తీజ్‌’

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో బుధవారం గిరిజన విద్యార్థుల ఆధ్వర్యంలో తీజ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి గోధుమ బుట్టలు ఎత్తుకుని పాటలు పాడుతూ నృత్యం చేసి ఉత్సాహంగా గడిపారు. అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ గిరిజన విద్యార్థులు సతీష్‌, ఆకాశ్‌, దేవదాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement