● మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 180 కిలోల దిగుబడి వస్తుంది.
● రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకు ఒక కోతలో 700 కిలోల చొప్పున ఏడాదికి 2100 కిలోల కరివేపాకు దిగుబడి వస్తుంది.
● నాలుగవ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక్కో కోతకు 1000 కిలోల చొప్పున 4 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది.
● ఐదవ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోత ఎకరాకు 2000 కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది.
త్రిపురారం : ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం పూర్తిగా భిన్నంగా మారింది. సకాలంలో వర్షాలు కురవడం లేదు. జలాశయాల్లో నీరు అశించిన స్థాయిలో లేదు. రైతులు అధికంగా నీటి ద్వారా పండించే పంటలు సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ నికర ఆదాయం వచ్చే పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు సులభంగా సాగు చేసుకోవడానికి కరివేపాకు అత్యంత అనుకూలంగా ఉంటుందని, మార్కెట్‌లో కూడా డిమాండ్ అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కరివేపాకు సాగులో రైతులు చేపట్టాల్సిన పలు పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించారు.
● సువాసిని : మెట్ట ప్రాంతాలకు సువాసిని రకం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేరు మొక్కల ద్వారా మాత్రమే విస్తరించి పెరుగుతుంది.
● డీడబ్ల్యూడీ –01 : ఈ రకం పంట భూమిలో వేరు పిలకల ద్వారా వేనుకొని పెరుగుతుంది. ఆకులు ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. చలిని ఎక్కువగా తట్టుకోలేదు. రోజువారీ కూరలతో పాటుగా కరివేపాకులను పొడిగా చేసుకొని వినియోగించుకోవచ్చు.
● డీడబ్ల్యూడీ– 02: విత్తనాల ద్వారా పంట రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఆకులు లేత పసుపు రంగులో ఉండడంతో పాటుగా వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. తక్కువ సమయంలో పెరుగుదల అధికంగా ఉంటుంది.
● భువనేశ్వర్ : అన్ని రకాల నేలల్లో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. తుక్కువ నీటి వసతైనా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. మురుగు నీరు పారే ఎర్ర నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఎర్ర నేలలు ఈ రకానికి అధిక దిగుబడులు అందిస్తుంది. అన్ని రకాలను భూమిలో విత్తుకోవడానికి ఎకరానికి 80 నుంచి 100 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
నేల తయారీ విత్తే పద్ధతి
ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు కలియ దున్నుకోవాలి. ఆకరి దుక్కిలో ఎకరాకు సుమారు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 30.30.30 సెంటీమీటర్ల పరిమాణం గల గుంతలను 1.2 నుంచి 1.5 మీటర్ల దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి ముందుగానే గుంతలు తీసుకోవడం ఉత్తమం. గుంతల్లో పశువుల ఎరువు నింపి మధ్యలో మొక్కలు నాటుకోవాలి. 30 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేసి నారు పెంచి నాటుకోవచ్చు. నారుమళ్లకు తగినంత పశువుల ఎరువులు వేసిన తరువాత 10 సెంటీమీటర్ల దూరంలో గీత గీసి విత్తనాలు విత్తుకోవాలి. మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.
ఎరువుల వినియోగం
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎకరాకు 28 కేజీల నత్రజని, 9 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను కలిపి గుంతలో సమానంగా నింపుకోవాలి. గుంతలను నింపిన వెంటనే వాటిలో మట్టిని తడుపుకోవాలి. మొక్క నాటిన 3 రోజుల తరువాత మరోసారి తడుపుకోవాలి. వారం తరువాత మరోసారి తడి అందివ్వాలి. నీరు అందుబాటులో ఉంటే కాలవలు తవ్వుకొని ఆరుతడిగా తడులు ఇస్తూ ఉండాలి.
సస్యరక్షణ చర్యలు
గొంగలి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు తెల్ల, నలుపు రంగులో ఉంటాయి. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి స్థూలకాయం రూపంలో ఉంటుంది. పురుగుల గుర్తిస్తే తీసీ నాశనం చేయాలి. వేప సంబంధిత క్రిమిసంహార మందులను ఉపయోగించి చీడపీడల నివారణ చేపట్టడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించడం ఉత్తమమైన పద్ధతి.
సాగు పద్ధతులపై వ్యవసాయ
శాస్త్రవేత్తల సూచనలు


