భువనగిరిటౌన్ : గడువులోగా వనమహోత్సవ లక్ష్యం పూర్తి చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. వనమహోత్సవంపై మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సమావేశంలో డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి , అధికారులు పాల్గొన్నారు.
నేడు శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణ
ఆలేరు : ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం వ్యవహర్త, ప్రధానాచార్య, కవి బండిరాజుల శంకర్ రచించిన శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేసినట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. విద్యాలయం ప్రాంగణంలో సాయంత్రం 4గంటలకు నిర్వహించే ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి , ఓయూ తెలుగు విభాగం పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘ఖేల్‌కి బాత్ పీఎం మోదీకే సాథ్’కు ఎంపిక
భూదాన్‌పోచంపల్లి: కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల27న మై భారత్ కార్యక్రమంలో భాగంగా ఖేల్‌కి బాత్ పీఎం మోదీకే సాథ్ కార్యక్రమానికి జిల్లా నుంచి పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపికై నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ తులసి వెల్లడించారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నట్లు చెప్పారు. క్రీడలు, యువ నాయకత్వం ఆవశ్యకత, వికసిత్ భారత్‌పై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు రాజేశ్వరమ్మ, రేణుకాదేవి, స్వాతి, చంన, అనురాధ, శివశంకర్, సంతోష్‌కుమార్, వెంకట్‌రెడ్డి, మురళీకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్లు సాయివర్థన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
‘ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్’ కోసం దరఖాస్తులు
భువనగిరి: ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ )సెల్‌లో సభ్యులుగా చేరేందుకు దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్య సాధనంలో భాగంగా ఈ సభ్యులు నిరంతరం పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు విద్యా సంబంధ మద్దతు, బోధన సామగ్రి అందుబాటులో ఉంచడం, తరగతి గదుల పరిశీలన వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సభ్యులుగా ఎంపిక చేసేందుకు కనీసం 2 సంవత్సరాలు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా అనుభవం ఉండాలని, ఎస్జీటీలు కనీసం 5 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలని కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు 56 సంవత్సరాల వయస్సుకు మించరాదని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.
27న గ్రామ, వార్డు సభలకు ఏర్పాట్లు
భువనగిరిటౌన్ : ఈనెల 27 జిల్లాలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


