ఇళ్లు ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ ప్రజలకు పరిహారం చెల్లించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. పునరావాస ప్యాకేజీ(ఆర్‌అండ్ ఆర్), భూ సేకరణ పరిహారం కోసం ప్రభుత్వం ఇటీవల రూ.206కోట్లు విడుదల చేసింది. వీటిలో రూ.84 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమచేసిన విషయం విదితమే. గతంలో కొందరికి పరిహారం అందింది. మిగిలిన 592 మంది బాధితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం అవసరమైన రూ.79కోట్లను వారిఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో పరిశీలన
గతంలో సర్వే చేసి వివరాలు గుర్తించినప్పటికీ, తుది నిర్ధారణకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒక్కో బృందంలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఒక ఆర్‌ఐ, ఒక జీపీఓ ఉన్నారు. ఈ బృందాలు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, బ్యాంక్ ఖాతాలను సరిచూస్తున్నాయి. అధికారులు వస్తున్నందున నిర్వాసితులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకం తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లింపు
డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి కాగానే బాధితులకు పరిహారం చెల్లించనున్నారు. ఆర్డీఓ ఆఫీస్ ద్వారా నేరుగా ఆర్‌టీజీఎస్ పద్ధతిలో ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గురువారం నాటికి ఈ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బస్వాపూర్ రిజర్వాయర్
ఫ రెండు రోజుల్లో 592మంది బస్వాపూర్ నిర్వాసితుల ఖాతాల్లో జమ
ఫ అర్హుల గుర్తింపునకు నాలుగు ప్రత్యేక బృందాలతో పునఃపరిశీలన
ఫ పరిహారం అందిన నెల రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేసేందుకు గడువు
పరిహారం చెల్లించిన వెంటనే బాధితులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు నెల రోజుల సమయం కేటాయించారు. వీరికి ఇవ్వాల్సిన ప్రథమ ప్యాకేజీ (రూ. 7.5 లక్షలు) అధికారులు ఇప్పటికే చెల్లించారు. గ్రామాన్ని ఖాళీ చేయించిన వెంటనే బస్వాపూర్ రిజర్వాయర్‌లో 5 నుంచి 9 టీఎంసీల నీటిని నింపాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


