విష జ్వరాలతో విలవిల | - | Sakshi
Sakshi News home page

విష జ్వరాలతో విలవిల

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయొద్దు

ఆలేరు: సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. వర్షాల ప్రభావం, పారిశుద్ధ్య లోపంతో వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి. ప్రధానంగా వైరల్‌ ఫీవర్‌తో పాటు టైఫాయిడ్‌ కేసులు గణనీయంగా పెరగడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి (సీహెచ్‌సీ)తో పాటు ప్రైవేట్‌ క్లినిక్‌లు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుకు తోడు వాంతులు, విరేచనాలతో రోజుకు పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల బాట పడుతున్నారు.

ఈనెలలో 237 కేసులు

ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ గణాంకాల ప్రకారం మే నెలలో 149 వైరల్‌, 8 టైఫాయిడ్‌ కేసులు నమోదు కాగా, జూన్‌లో 168, జూలైలో 308 మంది చికిత్స పొందారు. ఈనెల సోమవారం నాటికి ఓపీ బాధితుల సంఖ్య 237కు చేరింది. ఇందులో 86 మంది ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతుండగా, వీరిలో చిన్నారులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీల్లో దోమల బెడద తీవ్రంగా వేధిస్తోంది. రైల్వేస్టేషన్‌ ఎదురు వీధి, ఆర్టీసీ బస్టాండ్‌, మార్కండేయ కాలనీ, సిల్క్‌నగర్‌, కాటమయ్యబస్తీ, పాత మున్సిపల్‌ కార్యాలయం, క్రాంతినగర్‌, మంతపురి రోడ్డు తదితర కాలనీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యవస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్‌ నాలాలు, మురుగు కాల్వలు సరిగా శుభ్రం చేయడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ లేక కొన్ని కాలనీల్లో ఇళ్ల మధ్యనే మురుగు నీటి గుంటలు ఏర్పడి వల్ల దోమలతో జ్వరాలు వస్తున్నట్లు జనాలు వాపోతున్నారు. కాలనీల్లో ఫాగింగ్‌ చేయడంపైనా అధికారులు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పెరుగుతున్న జ్వరపీడితులు

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణకు ఫాంగింగ్‌ చేస్తాం. మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూస్తాం. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నాం. మంగళవారం నుంచి ఆయిల్‌ బాల్స్‌ వేస్తాం.

– శ్రీనివాస్‌రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌,ఆలేరు

వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇది చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే వైరల్‌ ఫీవర్‌గా మారి తీవ్ర అస్వస్థతకు గురికావాల్సి ఉంటుంది. కలుషిత ఆహారం, నీరు వల్ల టైఫాయిడ్‌ వస్తుంది. టైఫాయిడ్‌ రాకుండా ఉండాలంటే ఫ్రెష్‌ప్రూట్స్‌ తినడం, రోజూ కొద్దిసేపు వ్యాయామం చేస్తుండాలి. వేడి ఆహారపదార్థాలను తీసుకోవడం, బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

– స్వప్న రాథోడ్‌, సూపరింటెండెంట్‌, సీహెచ్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement