కొన్ని పొడవు..
ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం కొలతల్లో హెచ్చుతగ్గులు
ప్యాంట్, చొక్కా పొడుగ్గా ఉన్నాయి
శరీరానికి తగ్గట్టుగా డ్రెస్ కుట్టలేదు. చొక్కా, ప్యాంటు పొడుగ్గా ఉన్నాయి. లూజు లూజుగా కుట్టారు. విద్యార్థులంతా నా డ్రెస్ చూసి నవ్వుతున్నారు. వస్త్రం కూడా నాసిరకంగా ఉంది. గత సంవత్సరం ఇచ్చిన డ్రెస్ బాగుండే.
– ప్రవీణ్, 10 వతరగతి, మోత్కూరు
ఈ విద్యార్థి పేరు సిరిపురం అవినాష్. గుండాల మండలం పాచిల్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం నాణ్యత లేకుండా ఉంది. అంగి పలుచగా ఉండి చినిగిపోయే దశలో ఉంది. నెక్కర్‌కు కుట్టిన గుండీలు కూడా ఊడిపోతున్నాయి.
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం కొలతల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. లాగులు ఊడిపోవడం, చొక్కాలు చిరిగిపోతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం వస్త్రం, అస్తవ్యస్తమైన కొలతలతో కుట్టిన ఈ డ్రెస్సులు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.
కొలతలు ముగ్గురివే..
మున్సిపాలిటీల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పని అప్పగించారు. ఆరు మున్సిపాలిటీలకు చెందిన దుస్తులను భూదాన్‌పోచంపల్లికి చెందిన ఒక వ్యక్తికి ఆర్డర్ ఇవ్వడంతో విద్యార్థుల యూనిఫాంను కుట్టి ఇచ్చారు. విద్యార్థులందరి కొలతలు తీసుకోకుండా క్లాస్‌కు ముగ్గురు కొలతలు తీసుకుని అందరికీ డ్రెస్‌లు కుట్టారు. ఫలితంగా చాలా మంది విద్యార్థులకు అంగీలు పెద్దవిగా, నిక్కర్లు, ప్యాంట్లు చిన్నవిగా కొందరికి లూజ్‌గా అయ్యాయి. ఆత్మకూర్.ఎం మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల నాల్గవ తరగతి విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇచ్చారు. కుట్టు సరిగ్గా లేక పోవడంతో సరిచేయాలని టైలర్లను ఆశ్రయిస్తున్నారు.
టైలర్ల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలు
ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంలు సరిగ్గా సరిపోకపోవడంతో తల్లిదండ్రులు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. లూజ్‌గా ఉన్న, కొలతలు తప్పుగా వచ్చిన డ్రెస్‌లను స్థానిక టైలర్ల వద్దకు తీసుకెళ్లి మళ్లీ కుట్టించుకుంటున్నారు. కుట్లు సరిగా లేని డ్రెస్‌లను చూసి తోటి విద్యార్థులు నవ్వుతుండటంతో పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు.
33,284 మందికి యూనిఫాం పంపిణీ
జిల్లాలోని 17 మండలాల్లో సెర్ఫ్ పరిధిలో 589 ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఒక మోడల్ స్కూల్‌తో కలిపి మొత్తం 590 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 35,363 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మొత్తం 70,726 జతల యూనిఫాంలు కుట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 36,226 జతలు కుట్టారు. 33,284 మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. పోచంపల్లి మండలంలో 2,692 జతలకు గాను 37 జతలు మాత్రమే పూర్తికాగా 2,655 జతలు పెండింగ్‌లో ఉన్నాయి. నారాయణపూర్, రాజాపేట, బొమ్మలరామారం, రామన్నపేటలో కుట్టు పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వలిగొండ మోడల్ స్కూల్‌లో మాత్రం విద్యార్థులందరికీ డ్రెస్సులు పంపిణీ చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో 8157 మంది బాల బాలికలకు ఒక జత యూనిఫాం పంపిణీ చేశారు.
విద్యార్థికి పెద్దగా అయిన చొక్కా
నాసిరకం వస్త్రం కావడంతో అప్పుడే చినిగిపోతున్న దుస్తులు
కొందరికి బిగుతుగా మారిన చొక్కాలు..
మరికొందరికి ఊడిపోతున్న లాగులు
సరిచేయించేందుకు టైలర్లను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు


