మోటకొండూర్ : మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు నెలనెలా సక్రమంగా అందడం లేదు. గత నెల పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారుల ఐరీష్ తీసుకున్నప్పటికీ, బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బీపీఎం) 40 మందికి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేరే బీపీఎం వచ్చి గత రెండు నెలల పింఛన్ డబ్బులు తీసుకున్నారని, ఈ నెల మాత్రమే ఇస్తానని అనడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ పింఛన్ పుస్తకాన్ని రెగ్యులర్ బీపీఎం తీసుకున్నారని, ఇప్పుడు ఒక్క నెల మాత్రమే ఇస్తే ఎలా అని ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. గత రెండు నెలలుగా తమ పేరుపై తీసుకున్న డబ్బులతో శనివారం వచ్చి ఇవ్వాలని లబ్ధిదారులు బీపీఎంను వెనక్కి పంపించారు.
ఉపాధి హామీ బిల్లులకూ కోత..
మండల కేంద్రానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో పడిన డబ్బులను సైతం ఐరీస్ తీసుకుని డ్రా చేసి పూర్తిగా ఇవ్వకుండా సదరు బీపీఎం తిప్పుకుంటున్నారని బాధితులు గ్రామపంచాయతీ వద్ద అధికారులకు, సర్పంచ్‌కు మొరపెట్టుకున్నారు. ఉపాధి హామీ డబ్బులను సైతం డ్రా చేసి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని లబ్ధిదారులు వాపోయారు.
ఆందోళన చెందొద్దు
పోస్టాఫీసు ద్వారా అందించే పింఛన్లు, ఇతర లావాదేవీల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీపీఎం ఎవరికై నా డబ్బులు ఇవ్వకపోతే తప్పనిసరిగా ఇప్పించేలా చూస్తాం. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
– అమర్‌నాథ్, వంగపల్లి సబ్ పోస్టుమాస్టర్
బీపీఎం నిర్వాకం.. లబ్ధిదారుల ఆందోళన


