భువనగిరి: పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ మళ్లీ సమరశంఖం పూరించింది. వేతన సవరణ (పీఆర్‌సీ) అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించడమే లక్ష్యంగా దశలవారీగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 4 వేలకు పైగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఈ పోరాటంలో భాగస్వాములు కానున్నారు. ఆందోళనల రూపకల్పనకు శనివారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాన డిమాండ్లు
u పీఆర్సీని వెంటనే అమలు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి.
u కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరించాలి.
u ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్ల పెండింగ్ బిల్ల్లులను వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
u ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి.
u జీఓ నంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలి. జీఓ నంబర్ 190 అమలు చేయాలి.
దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు
అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయులు సమావేశం కానున్నారు.
పీఆర్‌సీ, డీఏలు, ఓపీఎస్
పునరుద్ధరించాలని డిమాండ్
ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట ధర్నా
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం.. 10న ఛలో హైదరాబాద్
నేడు సన్నాహక సమావేశం ఏర్పాటు


