మాడుగులపల్లి : ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. శుక్రవారం పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్నకు 2004లో సులోచన(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకన్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం, పిల్లలు సరిగా చదువుకోకపోవడంతో సులోచన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఈ నెల 10న రాత్రి ఇంట్లోని బాత్‌రూమ్‌లోకి వెళ్లి బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరుడు బందారపు వెంకటగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌యాదవ్ తెలిపారు.


