నష్టపోతున్న విద్యార్థులు
భువనగిరి: పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. జూన్ నెలలోనే ఖాళీల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీల వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నివేదికలు పంపినా.. మొదలుకాని ప్రక్రియ
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జూన్‌లోనే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఏయే స్కూళ్లలో ఏయే సబ్జెక్టులకు సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎంత మంది టీచర్లు రిటైర్ అయ్యారు? లాంగ్ లీవ్‌లో వెళ్లిన వారి వివరాలు తీసుకున్నారు. జూన్ 20 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను సేకరించారు. విద్యాశాఖ జారీ చేసిన మిగులు ఉపాధ్యాయుల పోస్టుల సర్దుబాటు ఉత్తర్వులు 2024ను అనుసరించి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. సేకరించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. కానీ నెల రోజులైనా ఇప్పటి వరకు సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించలేదు. జిల్లాలో సుమారు 40 నుంచి 46 మంది టీచర్లను వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.
715 ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో ప్రస్తుతం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 45,296 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 2,457 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,412 మంది, ప్రాథమిక పాఠశాలల్లో 1,045 మంది టీచర్లు పనిచేస్తున్నారు.
వర్క్ అడ్జస్ట్‌మెంట్ నిబంధనలు ఇవే..
పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోటు నుంచి తక్కువగా ఉన్న చోటుకు సర్దుబాటు చేస్తారు. ఒకే కేడర్‌లో అందరికంటే తక్కువ సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుడిని సర్‌ప్లస్ గా గుర్తిస్తారు. ఒకవేళ జూనియర్ కంటే సీనియర్ ఉపాధ్యాయుడు వర్క్ అడ్జస్ట్‌మెంట్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే అతని అభ్యర్థననూ పరిశీలిస్తారు. తొలుత మండల పరిధి, తర్వాత పక్క మండలం, ఆపై జిల్లా పరిధిలో ఖాళీలను బట్టి వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేస్తారు.
రిలీవింగ్‌పై ఆంక్షలు
గతంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లా పరిధిలోని మిగులు ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి కలెక్టర్‌కు అధికారాలు ఇచ్చారు. దీని ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో ఈ సర్దుబాటు ప్రక్రియ చేశారు. కాగా, వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రాతిపదికన మిగులు పాఠశాలల నుంచి అవసరమున్న స్కూళ్లకు పంపించిన టీచర్లను రిలీవ్ చేయవద్దని 2026 ఏప్రిల్ 22న స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
విద్యాశాఖ సర్దుబాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి కేటాయించిన పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది టీచర్లు రాజకీయ పలుకుబడితో లేదా ఉపాధ్యాయ సంఘాల ద్వారా సర్దుబాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఫ పాఠశాలలు తెరిచి రెండు నెలలైనా టీచర్ల సర్దుబాటుకు పడని అడుగులు
ఫ జూన్ 20 నాటికే ఖాళీలు, మిగులు ఉపాధ్యాయుల గుర్తింపు
ఫ ఉన్నతాధికారులకు నివేదిక చేరినప్పటికీ కలగని మోక్షం
ఫ పైరవీలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లే జాప్యం జరుగుతోందని విమర్శలు
ఇప్పటికే పాఠశాలల్లో ఎఫ్‌ఏ–1 నిర్వహించారు. సుమారు 20 శాతం వరకు సిలబస్ కూడా పూర్తయింది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో సిబ్బంది కొరత ఉంది. సర్దుబాటు ప్రక్రియ జరగక ఆయా స్కూళ్లకు ఉపాధ్యాయులు రాక, బోధన కుంటుపడి విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.


