కేటాయింపులు ఇలా..
భువనగిరి : ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కూల్ గ్రాంట్స్ (నిర్వహణ నిధులు) ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో హెచ్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడులు తెరిచి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ నుంచి నిధులు రాకపోవడంతో రోజువారీ నిర్వహణ ఖర్చులను ఉపాధ్యాయులే స్వయంగా భరించాల్సి వస్తోంది. దీనికి తోడు నాలుగు రోజుల్లో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. నిధుల కొరత ఆ ఏర్పాట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా ఈ నిధులు రెండు విడతల్లో విడుదలవుతాయి. తొలి విడత జూలై మొదటి వారంలోనే అందాల్సి ఉన్నా నేటికీ విడుదల కాలేదు.
విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు..
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిర్వహణ ని ధులను కేటాయిస్తోంది. నిబంధనల ప్రకారమే హెచ్‌ఎంలు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సొంత డబ్బులే గతి..
పాఠశాలల్లో హాజరు రిజిస్టర్లు, చాక్‌పీసులు, ల్యాబ్ సామగ్రి కొనుగోలు, చిన్నపాటి మరమ్మతులు, పరీక్షల నిర్వహణ వంటి అత్యవసర ఖర్చులన్నింటికీ ఈ నిర్వహణ నిధులే ఆధారం. స్కూల్ గ్రాంట్స్ సమయానికి అందకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ముందస్తుగా తమ సొంత డబ్బులను వెచ్చిస్తూ పాఠశాలలను నడిపిస్తున్నారు. మరోవైపు పాఠశాలలకు క్రీడా సామగ్రి కొనుగోలుకు సైతం నిధులు రావాల్సి ఉంది. త్వరలోనే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీలు జరగనున్న తరుణంలో.. విద్యార్థుల శిక్షణకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంలో ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కూల్ గ్రాంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
30 మంది వరకు విద్యార్థులున్న బడులకు రూ.10,000
31 నుంచి 100 మంది విద్యార్థులకు రూ.25,000
101 నుంచి 250 మంది విద్యార్థులకు రూ.50,000
1000 మంది వరకు విద్యార్థులున్న పెద్ద పాఠశాలలకు సంవత్సరానికి రూ.లక్ష వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ఫ నేటికీ అందని స్కూల్ గ్రాంట్స్
ఫ సొంత డబ్బులతోనే రోజువారీ నిర్వహణ భారం మోస్తున్న హెచ్‌ఎంలు
ఫ ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై ప్రభావం


