అవసరానికి తగ్గట్టుగా లేని పోస్టులు
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. తాజా నోటీఫికేషన్లలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జోన్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊసేలేదు. కేవలం తొమ్మిది బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో 33 పోస్టులు భర్తీకి ఉన్నాయి. ఇక, హైదరాబాద్ పరిధిలోని నూతన కమిషనరేట్లకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు కేటాయించలేదు. అసలు నూతన కమిషనరేట్ల పరిధిలో ఖాళీ పోస్టులు లేవా లేక చట్టపరమైన చిక్కులు ఉన్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
కమిషనరేట్ల పునర్విభజనతోనే చిక్కులు
గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిని ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం విభజించింది. ఫ్యూచర్ సిటీ, మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లు, యాదాద్రి భువనగిరి జిల్లాగా విభజించారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా రాష్ట్ర సచివాలయం, హోమ్‌శాఖ స్థాయిలో నిర్మాణంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఆయా కమిషనరేట్‌ల భౌగోళికంగా సరిహద్దులు మారినప్పటికీ, ఉద్యోగుల సర్వీసుల పంపిణీకి ఇంకా కొలిక్కిరాలేదు.
రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
రాష్ట్రపతి ఆమోదముద్రతో నూతన ఉత్తర్వులు అమల్లోకి రాకుండా పాత విధానంలో ఖాళీలను భర్తీ చేస్తే భవిష్యత్తులో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జోన్ల విభజన ప్రకటనల అమలుకు రాష్ట్రపతి అధికారిక ముద్రపడలేదు. దీంతో ఆయా ప్రాంతాల వారు రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.
రాచకొండ పరిధిలో పాత కేడర్ విధానమేనా!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు పోస్టులు కేటాయించినప్పటికీ యాదాద్రి భువనగిరి జోన్‌ను ఇంకా రాచకొండ కమిషనరేట్ పరిధిగానే భావిస్తున్నారు. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది భర్తీకి ప్రత్యేక కేటాయింపు జరగలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఫలితంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పాత కేడర్ విధానమేనా అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
పోలీస్ సిబ్బంది కొరత ఉన్నా..
హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో పోలీస్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి చట్టపరమైన ఆటంకాలు తొలిగే వరకు వీటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. జిల్లాతోపాటు హైదరాబాద్ మెట్రో రీజియన్ పరిధిలోని అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి నూతన పరిపాలనా జోన్ల ఆమోదం లభించిన వెంటనే, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తారు. యాదాద్రి భువనగిరి, ఉమ్మడి హైదరాబాద్ కమిషనరేట్ల పరిధికి సంబంధించి అదనపు ఖాళీలతో సరికొత్త కేటాయింపుల జాబితా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.
పోలీస్ శాఖలో ప్రస్తుతం భర్తీ చేసే ఉద్యోగాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా పోలీస్ పోస్టుల కేటాయింపు లేదు. ప్రధానంగా సివిల్, ఏఆర్ కానిస్టేబల్ పోస్టుల కేటాయింపే లేదు. ఇకపోతే ఎస్‌పీఎఫ్‌లో 8 బ్యాక్‌లాగ్ పోస్టులు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో బీసీ–సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాక్‌లాగ్ పోస్ట్ మాత్రమే ఉంది. పోలీస్ అనుబంధ విభాగాల్లో 31, జైలు వార్డర్ మెయిల్ 2 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీచేస్తారు. యాదాద్రి జోన్ (యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల) పరిధిలో 22 ఎస్‌ఐ పోస్టులు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో 2, టీజీఎస్‌పీ–1, డిప్యూటీ జైలర్ మెయిల్ 1, ఎస్‌పీఎఫ్ 44 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఫ కేవలం 9 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు
ఫ అనుబంధ విభాగాల్లో 33 పోస్టులే..
ఫ జోన్ పరిధిలో మాత్రం 22 ఎస్‌ఐలు, 44 ఎస్‌పీఎఫ్‌లు, 4 ఇతర పోస్టులు
ఫ తాజాగా వెలువడిన నోటిఫికేషన్లలో పోస్టులు అంతంతే..
ఫ మరిన్ని పోస్టులకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడేదాకా ఆగాల్సిందేనా!


