ఆలేరు : ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం ఆగదని అఖిల పక్ష నాయకులు అన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో రాష్ట్రప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అఖిలపక్ష కమిటీ బంద్ చేపట్టింది. నాయకులు మొదట పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్టాండ్ మార్గంలో ప్లకార్డులతో రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంలో వాహనాల రాకపోకలను పోలీసులు దారిమళ్లించారు. అనంతరం నాయకులు అంబేడ్కర్ విగ్రహాం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలవురు నాయకులు మాట్లాడుతూ పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని ప్రకటించి తర్వాత విస్మరించారని దుయ్యబట్టారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని, అమలులో మాత్రం ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కోకన్వీనర్లు పుట్ట మల్లేష్, మొరిగాడి చంద్రశేఖర్, నాయకులు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడి రమేష్, వడ్డెమాన్ నరేందర్, భేతి కృష్ణహరి, తుంగ కుమార్, చిలుకూరు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
ఆధ్వర్యంలో ర్యాలీ
అఖిలపక్ష కమిటీ బంద్‌కు మద్ధతుగా శుక్రవారం ఆలేరు పట్టణంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.జనార్దన్, ఇక్కిరి సహదేవ్, కల్లెపు అడివయ్య, ఆర్.సీత, పద్మ సుదర్శన్, చిరబోయిన రాజయ్య పాల్గొన్నారు.
ఫ వందరోజుల హామీని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఫ ఆలేరు ధర్నాలో అఖిల పక్ష నాయకులు


