యువికా.. చక్కటి వేదిక | - | Sakshi
Sakshi News home page

యువికా.. చక్కటి వేదిక

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

సూర్యాపేటటౌన్‌ : తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చక్కటి అవకాశం కల్పిస్తోంది. అంతరిక్ష సైన్స్‌, సాంకేతికత పరిజ్ఞానం అలాగే నూతన ధోరణులపై పాఠశాల విద్యార్థులకు మౌలిక విజ్ఞానాన్ని అందించేందుకు ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) పేరిట ప్రతి ఏటా ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026 శిక్షణకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికై న విద్యార్థులకు దేశంలోని ఏడు ఇస్రో కేంద్రాల్లో ఆయా అంశాలపై శిక్షణ ఇస్తారు.

అర్హులు వీరే...

ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50శాతం వెయిటేజీ, ఆన్‌లైన్‌ క్విజ్‌లో 10శాతం వెయిటేజీ ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర అంతకంటే ఎక్కువ స్థాయిలో జరిగిన సైన్స్‌ ఫేర్‌లు, పాఠ్యేతర అంశాల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒలంపియాడ్‌, క్రీడల్లో ప్రతిభ, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో పాల్గొనడం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదవడం తదితర అంశాలకు నిర్థేశిత వెయిటేజీలు ఉంటాయి.

31వ తేదీ వరకు గడువు

ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు https://jigyasa.iirs.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారి తొలి జాబితా ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. ఎంపికై న విద్యార్థులకు మే 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దేశంలోని వివిధ నగరాల్లో ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో శిక్ష శిబిరాలు ఏర్పాటు చేసి శాస్త్ర, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్‌ పద్ధతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మక ప్రదర్శన, చాట్‌, సందర్శన, నిపుణులతో ప్రయోగాలు, ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలు, చర్చా కార్యక్రమాలు ఉంటాయి. అంతరిక్ష విజ్ఞానం, రాకెట్‌ ప్రయోగాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి, గైడ్‌ ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రోనే భరిస్తుంది.

విద్యార్థులకు మంచి అవకాశం

విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. ప్రతి పాఠశాల నుంచి ఆసక్తి గల విద్యార్థులు యువికా శిక్షణకు దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– దేవరాజ్‌, జిల్లా సైన్స్‌ అధికారి,

సూర్యాపేట

ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష

విజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ

31వ తేదీ వరకు దరఖాస్తు

చేసుకునేందుకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement