ముందస్తు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవ్వండిలా.. | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవ్వండిలా..

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

గుర్రంపోడు : రైతులు మందస్తుగా ఖరీఫ్‌ సాగు చేపట్టేందుకు ఇప్పటికే పత్తి కట్టెను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు చేయాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచిస్తున్నారు. ఖరీఫ్‌ ముందస్తు సాగుకు సన్నద్ధమ్యే రైతులకు ఆయన సూచనలు, సలహాలు..

లోతు దుక్కులతో మేలు

లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలోని తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్ధలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయటపడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గే అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం.

లోతు దుక్కులతో కలుపు నిర్మూలన

తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్ధాలను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమే కాకుండా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టమవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరి వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి.

● గత ఖరీఫ్‌లో వేసిన పత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి. పొలంలో గట్టిపొర ఏర్పడితే ఎర్రని ఇసుక మట్టిని తోలడం వల్ల భూమి బాగుపడుతుంది. వేసిన పంట నుంచి వేర్లు సులభంగా భూమిలోకి దిగుతాయి. వేసవిలోనే సేంద్రియ ఎరువులు పంట పొలాలకు తరలించుకోవాలి. నీటి లభ్యత ఉన్న రైతులు పెంట కుప్పలపై నీటిని చిలుకరించడం వల్ల తొందరగా ఎరువుగా మారుతుంది. కుళ్లని సేంద్రియ ఎరువులు వర్షాధార పంటల్లో త్వరగా బెట్ట పరిస్ధితులను కల్గిస్తాయి.

పంట మార్పిడి తప్పనిసరి

ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేసుకుని పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగుచేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమృద్ధిగా లభించి అవి వృద్ధి చెందుతాయి. ఆ పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. వివిధ రకాల వేరు వ్యవస్థలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి.

● పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలకు బదులు భూమికి పోషకాలు సమకూర్చే అపరాలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్ధితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుధాన్యాల పంట కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. మిరుప, టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి పంటల ఎర పంటలుగా వేసుకోవాలి. టమాట, మిరుప, పుచ్చ పంటల్లో బంతిని కూడా ఎర పంటగా కొన్ని సాళ్లు వేసుకుని తెగుళ్లు, ఆకుముడత నివారించవచ్చు. పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలు ఎంచుకోకపోతే చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బెండ తర్వాత ప్రత్తి వేయకూడదు. జొన్న సాగు చేసిన వెంటనే మిరుప వేయకూడదు. ఈ పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్ట పరుస్తాయి.

భూసార పరీక్షలు చేయించాలి

పండ్ల తోటలు సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనూకూలమో నిర్ధారించుకోవాలి.

గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement