అనంతగిరి : భార్య మందలించిందని మనస్తాపానికి గురై గడ్డి మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన అనంతగిరి మండలం లక్కారం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కారం గ్రామానికి చెందని మదాసు సాయిప్రవీణ్(24)కు భార్య, 17 నెలల బాబు ఉన్నారు. సాయిప్రవీణ్ ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా ఉంటుండడంతో ఈ నెల 13న రాత్రి భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రవీణ్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్దకువె వెళ్లి గడ్డి మందు తాగాడు. స్ధానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బావ సొమపంగి ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.
గుర్తుతెలియని
వాహనం ఢీకొని..
పెద్దఅడిశర్లపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని యవకుడు మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలంలో గురువారం రాత్రి జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కాసారం గ్రామానికి చెందిన బొజమోని అఖిల్(23) ద్విచక్ర వాహనంపై పెద్దవూర నుంచి అంగడిపేట ఎక్స్ రోడ్ వద్దకు వస్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల్ పైనుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థి దుర్మరణం
కట్టంగూర్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల బస్టాప్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరసానిగూడెం గ్రామానికి చెందిన కడారి శివాజీ(19) ఇటీవల నల్లగొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. పామనగుండ్ల గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన శివాజీ తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తూ.. పామనగుండ్ల బస్టాప్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా నకిరేకల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న శివాజీ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.
108 వాహనంలో ప్రసవం
అడ్డగూడూరు: పురిటి నొప్పులతో బాధపడు తున్న గర్భిణిని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన ఆశ కార్యకర్త కడియం సుమన కుమార్తె మనీషాకు గురువారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పురిటి నొప్పులు అధికమవ్వడంతో 108 మెడికల్ టెక్నీషియన్ యాకస్వామి, ఆశ కార్యకర్త సుమన ప్రసవం చేయగా ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినట్లు మెడికల్ టెక్నీషియన్ తెలిపారు.


