భువనగిరిటౌన్ : జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులకు శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఈనె 16న సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
చేనేతకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి
మోత్కూరు : చేనేత, పవర్ లూమ్ పరిశ్రమకు వేర్వేరుగా రూ.2 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిప్టు పథకంలో కార్మికుడికి రూ.1,200, అనుబంధ కార్మికుడికి రూ.800 రికరింగ్ డిపాజిట్ చేస్తే ప్రభుత్వం వాటా కింద చేయాల్సిన డిపాజిట్‌ను తొమ్మిది నెలలుగా చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారివెంట చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముశం నరహరి, ఉపాధ్యక్షుడు వడకాల చంద్రశేఖర్ ఉన్నారు.
ఇందిరమ్మ గృహం.. నిరుపేదలకు వరం
యాదగిరిగుట్ట రూరల్ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరంలాంటిదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు, వంగపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహాల ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులకు పట్టువస్త్రాలు, పొట్టేలును కానుకగా అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీల ప్రకారం గూడులేని వారికి ఇళ్లు కట్టించి వారి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచులు చిన్నం మమత, వగ్గు రవళి , కానుగు బాల్‌రాజ్, చిన్నం శ్రీను, కానుగు రాజీవ్, గుర్రం బాలస్వామి, చిన్నం మల్లేష్, కొక్కలకొండ అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రానికి
గ్యాస్ ఇబ్బంది లేదు
– ఆలయ ఈఓ భవాని శంకర్
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆలయ ఈఓ భవాని శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత దేవస్థానానికి లేకుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు లేఖ రాసి సంప్రదించామని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గ్యాస్ ఏజెన్సీ అధికారులు నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను అందించారని తెలిపారు. దేవాలయానికి సుమారు 425 కిలోలవి ప్రతినెలా 12 సిలిండర్లు, 19 కిలోలవి 250 సిలిండర్లు అవసరం పడుతున్నాయని, వీటిని అన్న ప్రసాదం, ప్రసాదాల తయారీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలో ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.


