భువనగిరిటౌన్ : జిల్లాల్లో గృహ అవసరాలకు ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా యంత్రాంగాలతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అక్షాంక్షశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా ప్రజలకు గ్యాస్ కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని, పలు చోట్ల దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 49 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. గృహవసరాలకు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులకు సిలిండర్ కొరత రాకుండా చూసుకోవాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు. వాణిజ్య సిలిండర్లకు కొంత ఇబ్బంది ఉంది తప్ప, గృహవసరాలకు ఎలాంటి కొరత లేనందున ప్రజలు ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదులకు సెల్ 9281423623 నంబర్ సంప్రదించవచ్చన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియ సమగ్రంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ఆర్‌డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి రోజారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణ అధికారులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


