ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత | - | Sakshi
Sakshi News home page

ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత

Mar 5 2026 8:55 AM | Updated on Mar 5 2026 8:55 AM

త్రిపురారం : వివిధ రకాల పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ పేర్కొంటున్నారు. ఎరువుల యాజయాన్యం పద్ధతులు ఆయన మాటల్లోనే..

నత్రజని: పంటలపై పురుగులు దాడి చేసి నష్టం కలిగించడానికి.. నత్రజని వాడకానికి ముడిపడి ఉంటుంది. నత్రజని వాడకం పెంచడంతో మొక్కలు ఏపుగా పెరిగి శాఖీయోత్పత్తి బాగా జరిగి ఆకులు, కాండాలు, బిరుసుతనం కోల్పోయి మెత్తగా తయారై పురుగులు అనువుగా తయారవుతాయి. పంటలపై జరిగిన పరిశోధనల్లో సిఫారసు చేయబడిన మోతాదుకు మించి నత్రజని వాడకం వలన పురుగుల బెడద ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నత్రజని నెమ్మదిగా వినియోగంలోకి రావడానికి యూరియాను వేపపిండితో కలిపి లేదా నిమిన్‌ వంటి వేప సంబంధిత వాటితో కలిపి వాడుకోవచ్చు.

భాస్వరం: మొక్కలు భాస్వరాన్ని లవణాల రూపంలో తీసుకుంటాయి. పూలు, విత్తనాలు దుంపలు తదితర ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువగా ఉంటుంది. భూమిలో సేంద్రియ ఎరువులు ఎక్కువగా కుళ్లేందుకు ఉపయోగపడుతుంది. పంట త్వరగా పక్వానికి వస్తుంది. కణ విభజన, పైరు అభివృద్ధి, మొక్క త్వరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పైర్లకు కలిగే దుష్ఫలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమయ్యే కిరణజన్య సంయోగక క్రియ జరగడానికి కీలకపాత్ర పోషిస్తుంది.

పొటాష్‌ : చీడపీడల యాజమాన్యంలో పొటాష్‌ పాత్ర అత్యంత కీలకం. పంటలకు తగినంత పొటాష్‌ అందించినప్పుడు మొక్కల్లో కొన్ని రకాల ఫినాలిక్‌ కాంపౌండ్స్‌ తయారై రక్షణగా ఉంటాయి. కణకవచం గట్టిగా తయారై దండెత్తే పురుగులకు అడ్డుగోడగా నిలుస్తుంది. వరి పైరులో చీడపీడలపై అధిక ప్రభావం చూపి సమర్ధంగా అరికడుతుంది. బాక్టీరియా, బూజు సంబంధిత తెగుళ్లను 70 శాతానికి పైగా అరికడుతుంది. పురుగులు, మైట్స్‌ దాడి నుంచి 60 శాతానికి పైగా రక్షణగా నిలుస్తుంది. చెరుకు పంటకు తగినంత పొటాష్‌ వేసినప్పుడు పొలుసు పురుగు, పత్తిలో ముక్కు పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. టమాటా, మిరప, వంకాయ, బంగాళాదుంప వంటి కూరగాయల పంటలకు శాస్త్రవేత్తల సూచనల మేరకు పొటాష్‌ అందిస్తే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది.

జీవ ఎరువుతో ఉపయోగాలు

జీవ ఎరువుల్లో బాసిల్లాస్‌, సూడోమోనాస్‌ వంటి సూక్ష జీవులు ఆస్పర్జిల్లడ్‌, పెన్సిలియం వంటి శీలింద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కల లభ్యతను పెంచుతాయి. సిఫారసు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరకు తగ్గించుకోవచ్చు. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములుగా 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement