కేతేపల్లి: వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వరస్వామి జాతర సందర్భంగా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు భక్తులు అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలపాలయ్యారు. భీమారం గ్రామం సమీపంలోనే ఉన్న ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న జాతరకు గ్రామం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారి పల్లకీని నిప్పుల గుండం దాటించే క్రమంలో.. భీమారం గ్రామానికి చెందిన సామగాని నాగరాజు, నాయకం గంగమ్మ, ఏర్పుల సంధ్య, దూబని విజయ, కొరివి సంధ్య, మేకల మత్తమ్మ, మేకల పుష్ప నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఆమనగల్లు గ్రామానికి చెందిన ఉత్తెర్ల కృష్ణయ్య, మారిపెద్ది సాయి, వట్టె మానసలతోపాటు దోసపాడుకు చెందిన సింగం వినోద, మిర్యాలగూడకు చెందిన మేడబోయిన సైదమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు, మాడ్గులపల్లి ఎస్‌ఐ కృష్ణయ్య సిబ్బందితో అప్రమత్తమై అందరిని బయటకు లాగారు. భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ రమాదేవి క్షతగాత్రుల వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు, గంగమ్మ, సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కేతేపల్లి మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్‌యాదవ్, నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, భీమారం సర్పంచ్ పద్మవెంకన్న క్షతగాత్రులను పరామర్శించారు.
అమనగల్లు ఘటనలో భీమారం గ్రామానికి చెందిన ఏడుగురికి గాయాలు


