భువనగిరిటౌన్ : రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగను సోదరభావంతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మైనారిటీ సంక్షేమ అధికారిణి జయమ్మ, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


