వేప చెట్టు పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయం లేవగానే వేప పుల్లతో పళ్లు తోమ్ముకోవడం మాకు అలవాటు. అలాంటి వేప చెట్లు వింత రోగం వల్ల నశిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రోడ్డ పక్కన, పొలాల వద్ద ఉన్న వేపచెట్లు ఎండిపోతున్నాయి. ఈనెల 19న ఉగాది పచ్చడికి వేప పూత కరువవుతుంది. శాసీ్త్రయ పరిశోధన చేసి వేప చెట్లను కాపాడాలి.
– నారబోయిన వెంకటేశం, అడ్డగూడూరు
అడ్డగూడూరు: తెలుగు సంవత్సరాది పండుగ వచ్చిందంటే ముందుకుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. మామిడి, చింతపండు, వేపపూత, కారం, ఉప్పు, బెల్లం వేసి పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాదీ స్వీకరిస్తారు. ఇందులో ఉండే తీపి, చేతు, వగరు, పులుపు, ఉప్పు, కారం ఈ షడ్రుచులు అనేవి జీవితంలో అన్ని అనుభవాలకు ప్రతీక. ఇలా ఎంతో ప్రధాన్యం కలిగిన పచ్చడి తయారీలో అవసరమైన వేపపూత ఈ సారి దొరకని పరిస్థితి నెలకొంది. వేప చెట్లకు డైబ్యాక్ తెగులు సోకి నిలువుగా ఎండిపోయాయి. ఉగాది పండుగ వేళ వేప పూతతో పచ్చగా కలకలలాడాల్సిన వేప చెట్ల మోడువారి దర్శనమిస్తున్నాయి.
ఉనికి కోల్పోతున్న ఆరోగ్య ప్రదాయిని
గ్రామీణ జీవనంలో వేప చెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం వృక్షం మాత్రమే కాదు.. ప్రకృతి ప్రసాధించిన అద్భుత ఔషధ గని. పల్లెల్లోని రైతులు, ప్రజలు తెల్లవారు జామున వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి పళ్లు తోముకునే వేపపుల్ల మొదలుకొని ఒంటి నొప్పులు ,చర్మవ్యాధులను సయంచేసే ఆకుల వరకు ఇలా వేప ప్రతిభాగం మానవారోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తోంది. గాలిని శుద్ధి చేస్తూ చల్లని నీడను ఇస్తూ ప్రతి ఇంటిముందు ఒక వైద్యుడిలా కొలువై ఉండే వేపచెట్టు నేడు తన ఉనికిని కాపాడుకోవడానికిపోరాడుతోంది.
మొదట ఆకులు రాలి..
ఎప్పుడు ఆరోగ్యంగా కనిపించే వేపచెట్లు నిలువునా ఎండిపోవడానికి డైబ్యాక్ అనే తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలం మారే సమయంలో సోకుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం కారణమని అంటున్నారు. కొమ్మల చివరి నుంచి ఆకులు రాలిపోయి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. పచ్చని ఆకులు కాస్తా నల్లగా మారి నిర్జీవమవుతున్నాయి. వ్యాధి తీవ్రమైతే చెట్టుమొత్తం ఎండిపోయి చనిపోతుందంటున్నారు. ఈ వ్యాధి గాలి వల్ల వ్యాప్తిస్తుండి కాబట్టి పక్కన ఉన్న చెట్లకు కూడా సులువుగా అంటుకుంటుంది. అందువల్లే రహదారుల పక్కన వరుసగా ఉన్న చెట్లకు సోకి ఎండిపోతున్నాయని వారు అంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మూడునాలుగు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా మోడువారిన వేప చెట్లే దర్శన మిస్తున్నాయి. ఈ వింత వ్యాధి కారణంగా ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. వేప చెట్లకు సోకిన వ్యాఽధికి తగిన నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
వేప పువ్వు లేకుండా..
ఈనెల 19వ తేదీన ఉగాది పండుగ ఉంది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన మామిడి కాయలు, చింతపండు,బెల్లం, ఉప్పు, కారం అందుబాటులో ఉన్నాయి. కానీ వేప పువ్వు లేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే పచ్చడి తయారు చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


