ఇంకా ఉత్తర్వులు రాలేదు
భువనగిరి: మళ్లీ మూడు నెలల రేషన్ బియ్యం ముందస్తుగానే అందనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా బియ్యాన్ని ఒకే సారి ఏప్రిల్‌లో పంపిణీ చేయనున్నారు. వచ్చే వేసవి కాలం దృష్ట్యా మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పంపిణీని ఈమేరకు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మూడు నెలలకు సంబంధించి అవరసరమైన 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. ఈ బియాన్ని స్టాట్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు తరలించనున్నారు.
515 రేషన్ దుకాణాలు
జిల్లాలో ప్రస్తుతం మొత్తం 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,47,757 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,688 అంత్యోదయ కార్డులకు 381479 యూనిట్లు, 2,34,069 ఆహారభద్రత కార్డులకు 6,92,142 యూనిట్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా సుమారు 4,961 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటాయి. ఇలా మూడు నెలలకు కలిపి సుమారు 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించనున్నారు.
కారణాలు ఇవే..
గత ఏడాది వర్షాకాంలో వరదల ముప్పు, ప్రకృతి విపత్తులను దృష్టి ఉంచుకుని తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉండటం వంటి కారణాలతో గతంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా ఒకే సారి పంపిణీ చేశారు. ఈ సారి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణం శాఖ వేసిన అంచనాను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సమస్యలు పునరావృతం కాకుండా..
గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడంతో లబ్ధిదారులు, రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేయడం ద్వారా రవాణా చార్జీల ఖర్చు తగ్గడంతో పాటు హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. కానీ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేక డీలర్లకు సమస్యగా మారింది. ఆ తర్వాత విడతల వారీగా డీలర్లు బియ్యం తీసుకుపోయే అవకాశం కల్పించినా ఇబ్బందులు తప్పలేదు. ఇక మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే ఒక కార్డు దారుడు మూడు సార్లు వేలి ముద్ర వేయాలి. ఈ క్రమంలో గతంలో సిగ్నల్‌తో పాటు సర్వర్ సమస్య, మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఒక్కో కార్డు దారుడికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయ పట్టింది. దీంతో లబ్ధిదారులకు రేషన్ దుకాణాల వద్ద నిరీక్షణతప్పలేదు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఎక్కడికి తరలించాలి అనే సమస్య అధికారులకు ఎదురుకానుంది.
మూడు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడం పై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక వేళ ఆదేశాలు వస్తే అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ మేజేజర్
ఫ ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్
ఏప్రిల్1 నుంచి పంపిణీ
ఫ రేషన్ షాపులకు తరలనున్న 14,883 మెట్రిక్ టన్నుల బియ్యం
ఫ ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు
ఫ వీటిని ఖాళీ చేయడానికి
సమయం పట్టే అవకాశం


