99 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి
భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా పనిచేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్ని విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది, ఇన్‌పెషెంట్, అవుట్‌పెషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనం పై కొనసాగుతున్న అదనపు భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన
భోజనం అందించాలి
బాలసదనంలోని విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భువనగిరి పట్టణంలోని మీనానగర్‌లో ఉన్న బాలసదన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ రాంలింగం, తహసీల్దార్ జగన్‌మోహన్‌ప్రసాద్, ఆర్‌బీ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి, యశోద సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
భువనగిరిటౌన్ : ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు నిర్వహించే ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


