మరణంలోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహం

Mar 3 2026 9:37 AM | Updated on Mar 3 2026 9:37 AM

శాలిగౌరారం : చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గుడిసె సైదులు, సరోజన దంపతులకు కుమార్తె, కుమారుడు రవి(20) ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. సైదులు నిమ్మ తోటలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సైదులు అనారోగ్యానికి గురికావడంతో భార్య సరోజన, కొడుకు రవి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన నిమ్మ తోట కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కౌలు పూర్తి కావడంతో ఇటీవలే ఊట్కూరు గ్రామానికి వచ్చారు.

7వ తరగతి నుంచి క్లాస్‌మేట్స్‌

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వంశీ(20) అమ్మమ్మ ఊరు ఊట్కూరు పక్కనే ఉన్న బండమీదిగూడెం. దీంతో వంశీ 7వ తరగతి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఊట్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో రవితో కలిసి చదివాడు. ఇంటర్మీడియట్‌ కూడా రవి, వంశీ కలిసే చదివారు. ఇద్దరూ ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యారు. దీంతో రవి తల్లిదండ్రులతో కలిసి నిమ్మ తోటలు కౌలు చేస్తుండగా, వంశీ హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

సప్లమెంటరీ పరీక్షల కోసం వచ్చి..

హైదరాబాద్‌లో ఉంటున్న వంశీ ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు రెండు రోజుల క్రితం డి. కొత్తపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వంశీ బైక్‌పై ఊట్కూరుకు వచ్చి రవిని వెంట తీసుకుని నల్లగొండలో పరీక్ష రాసేందుకు బయల్దేరాడు. మార్గమధ్యలో నల్ల గొండ మండలం చందనపల్లి వద్ద స్కూల్‌ బస్సును ఢీకొని ఇద్దరూ మృతిచెందారు. సోమవారం రాత్రి ఊట్కూరులో రవి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో రవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఊట్కూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరు స్నేహితులు దుర్మరణం

శాలిగౌరారం మండలం

ఊట్కూరులో విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement