భువనగిరి: సంత్ కబీర్, జాతీయ చేనేత అవార్డు ప్రదానం కోసం ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో భాగంగా ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సంత్ కబీర్ అవార్డు కోసం 50 సంవత్సరాల వయస్సు నిండి చేనేత రంగంలో 20 సంవత్సరాల అనుభవం, జాతీయ చేనేత అవార్డు కోసం 30 సంవత్సరాలు పై బడిన వారు చేనేత రంగంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండలని తెలిపారు. అర్హత, ఆసక్తి క లిగిన వారు ఈ నెల 23లోపు దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయాలని కోరారు.
టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి,యాదాద్రి : రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. యాసంగి 2025–26 వరిధాన్యం కొనుగోళ్లపై సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎత్తు, పల్లాలు సరిచూసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ లు, గన్నీ బ్యాగులు సరిపడా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్లు అందజేయాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందిలేకుండా తాగునీరు, టెంట్లు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని పీపీసీ కేంద్రాలవారు మార్చి 15 లోగా తూకపు యంత్రాలు, తేమ యంత్రాలను సంబంధిత అధికారులచే ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 293 మంది గైర్హాజరు
భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 28 కేంద్రాలలో గణితం–1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 7,308 మంది విద్యార్థులకు గాను 7,015 మంది హాజరు కాగా 293 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
బీఈడీలో నాణ్యతాప్రమాణాలు మెరుగుపడాలి
నల్లగొండ టూటౌన్ : బీఈడీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో కలిపి కనీసం 10 మంది అధ్యాపకులను విధిగా నియమించాలన్నారు. ఆధార్‌లింక్‌తో అధ్యాపకుల నమోదు జరగాలని, 75 శాతం విద్యార్థి హాజరును కచ్చితంగా పాటించేందుకు ఫేస్ రికగ్నిషన్ మెషీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఆకుల రవి పాల్గొన్నారు.
ప్రతిపల్లెకూ ఆర్టీసీ బస్సు నడపాలి
మునుగోడు : ప్రభుత్వం పత్రి పల్లెకు ఆర్‌టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్తులు తమకు నల్లగొండ నుంచి మునుగోడు మీదుగా బస్సు నడపాలని ఇటీవల ఎమ్మెల్సీని కలిసి కోరగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయించారు. సోమవారం మునుగోడులో బస్సును ప్రారంభించి అదే బస్సులో లింగవారిగూడెం వరకు ప్రయాణించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం నూరుశాతం అమలయ్యేందుకు ప్రతిపల్లెకు బస్సు ఏర్పాటు చేయాలన్నారు.


