కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో?

Mar 3 2026 9:36 AM | Updated on Mar 3 2026 9:36 AM

ఆదేశాలు రాగానే ఎన్నుకుంటాం

రామన్నపేట : గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికపై తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లోనే కో ఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ నూతన పాలకవర్గాలు కొలువుదీరి రెండు నెలలుదాటినా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆశావహులకు ఎదుచూపులు తప్పడంలేదు.

సర్పంచ్‌లకు శిక్షణ కూడా..

జిల్లాలో 2025 డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అదే రోజున చాలా గ్రామాల్లో ఉపసర్పంచ్‌లను ఎన్నుకున్నారు. వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల వాయిదా పడిన ఉపసర్పంచ్‌ ఎన్నికను మరుసటి రోజు నిర్వహించారు. కొత్త సర్పంచ్‌లకు భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని రామానంద తీర్ణ గ్రామీణ సంస్థలో విడతల వారీగా శిక్షణ కూడా ఇస్తున్నారు. అయినా కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక మాత్రం చేపట్టలేదు.

ప్రతీ పంచాయతీకి ముగ్గురు

కో ఆప్షన్‌ సభ్యుల చొప్పున..

పంచాయతీ రాజ్‌ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులు ఉంటారు. పంచాయతీ పాలకవర్గం వీరిని ఎన్నుకుంటుంది. కో ఆప్షన్‌ సభ్యులకుసైతం వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. వీరు పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా సలహాలు సూచనలు చేయవచ్చు. ఉపసర్పంచ్‌ల ఎన్నిక, అవిశ్వాస సమయాల్లో ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ముగ్గురిలో ఒకరు గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మరొకరు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి, ఇంకొకరు గ్రామాభివృద్ధికి సహకరించే దాత లేదా ఎన్‌ఆర్‌ఐ ఉంటారు.

ఆశావహులకు తప్పని నిరీక్షణ

ఎన్నికలు జరిగిన నెల రోజుల లోపు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి. వీరి ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేదు. అసలు ఎన్నిక ఉంటుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో వార్డుల్లో పోటీలో ఉన్న వారిని విరమింప జేయడం, వివిధ పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా జరిగిన ఒప్పందాలలో కో ఆప్షన్‌ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. అలాంటి హామీ పొందిన ఆశావహులు కో ఆప్షన్‌ పదవికోసం నిరీక్షించక తప్పడం లేదు.

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంఽధించి కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నిక ప్రక్రియ చేపడతాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

–విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ, యాదాద్రి భువనగిరి

ఫ పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి రెండునెలలు

ఫ కో ఆప్షన్‌ ఎన్నికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

ఫ ఎదురు చూస్తున్న ఆశావహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement