భువనగిరిటౌన్ : కళాకారుల హక్కుల సాధనకు పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్ పేర్కొన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా, సామాజిక భద్రత హామీలు లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ, తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్, చిగుర్ల లింగం, జిల్లా సమితి సభ్యులు వెంకటేష్, ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు భూషిపాక నరసింహ, ఉపాధ్యక్షులు పిట్టల శంకర్, ఇంజా హేమలత, కట్ల యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి పోతు ప్రవీణ్, సోమ నర్సయ్య, మొగుళ్ల శేఖర్ రెడ్డి, మూల పోచయ్య, కళాకారులు మనోహర, జాను, శ్రీనివాస్, రాజప్ప, రేణుక, నవనీత, కృష్ణమ్మ, వసంత, కవిత, ఎలేంద్ర, లక్ష్మి పాల్గొన్నారు.


