చికిత్స పొందుతూ రైతు మృతి
గుర్రంపోడు : అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందా డు. ఆదివారం గుర్రంపోడు ఎస్‌ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకా రం.. గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవింద్(55) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సరైన దిగుబడి లేక నష్టపోయాడు. గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహానికి అప్పు కావడంతో అప్పులు అంతకుఅంత పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి గోవింద్‌ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


