‘వయ్యారిభామ’తో పంటకు నష్టం
త్రిపురారం : రైతులు పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ(పార్థీనీయం) కలుపు మొక్కకే. ఎందుకంటే ఈ కలుపు మొక్కకు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఒక్కో వయ్యారిభామ కలుపు మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క నివారణ చర్యలు కేవీకే కంపాసాగర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు ఆయన మాటల్లోనే..
వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెన్షన్‌కు గురువుతాయి. పశుగ్రాసం పంటకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ.
వయ్యారిభామను తొలగించే విధానం
పార్థీనీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే రైతులు చేతితోనే తొలగించాలి. మొక్కలు పూత దశకు రాకముందే తొలగించి వాటిని మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించి తొలగించి కుప్పలుగా వేసి కాల్చివేయాలి. మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ కలుపు మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసం సాగు చేసుకునే రైతులు పంట వేయక ముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
పూతకు రాకముందే తొలగించాలి
కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం
శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు
కంపోస్టుగా కూడా తయారు చేసుకోవచ్చు
వయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికీ వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిదంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రీయ ఎరువుగా వినియోగించుకోవచ్చు.
‘వయ్యారిభామ’తో పంటకు నష్టం


