డిగ్రీ అభ్యర్థులకు మరో అవకాశం
రామన్నపేట : వివిధ కారణాలతో 2010–11 విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు డిగ్రీ కోర్సు పూర్తి చేయలేక పోయిన విద్యార్థులకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించిందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రహత్‌ఖానం, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాత విధానం (ఇయర్ వైజ్), ప్రస్తుత సెమిసస్టర్ విధానంలో బ్యాక్‌లాగ్ పేపర్లు కలిగిన విద్యార్థులు ఈనెల 4వ తేదిలోగా పరీక్ష ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇరాన్‌పై దాడులు అప్రజాస్వామికం
భువనగిరిటౌన్ : ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడులు చేయడం అప్రజాస్వామికమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. ఒకదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహరిస్తుందని ఆరోపించారు. ట్రంప్ పాలనలో యుద్ధన్మాదం తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రజలంతా అమెరికా ట్రంప్ చర్యలను ఇజ్రాయిల్ దురాగతాలను వ్యతిరేకించాలని కోరారు.
ప్రైవేటు విద్యాసంస్థల
దోపిడీని అరికట్టాలి
చౌటుప్పల్ : రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టి పకడ్బందీగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన పాలక ప్రభుత్వమే ప్రైవేటు విద్యా రంగంపై మొగ్గు చూపుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కల్లూరి మల్లేశం, లావుడియా రాజు, నాగరాజు, రాహుల్, తీగుళ్ల శ్రీనివాస్, జగన్, ఉదయ్, ఇందురాణీ, ప్రకాష్, శ్రవణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకారులు
అన్నిరంగాల్లో ఎదగాలి
మోత్కూరు : స్వర్ణకారులు అన్నిరంగాల్లో ఎదగాలని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలాచారి అన్నారు. ఆదివారం మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాగోజు నరసింహాచారి, ఎన్నికల ఇన్‌చార్జ్ కె.శ్రీనివాసచారి, పూర్ణాచారి, రిటైర్డ్ హెచ్‌ఎం ఎం.బ్రాహ్మచారి, టి.మనోహరాచారి, సీనియర్ జర్నలిస్టు ఎస్‌ఎన్.చారి, చేపూరి అనిల్, ఆకవరం శ్రీనివాసాచార్యులు, సంఘ నాయకులు నరసింహాచారి,కొల్లోజు నరేందర్, షణ్ముకచారి, మోత్కూరు నవీన్, మోత్కూరు జగన్, బోగోజు రవి, సజ్జనం మనోహర్ పాల్గొన్నారు.
రేణుకాచార్య
జయంతి ఉత్సవాలు
ఆలేరు రూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలోని సోమేశ్వరాలయంలో ఆదిజగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా రుద్రాభిషేకాలు, చండీ హోమం, లక్ష దీపోత్సవం, శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వీరశైవ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వీరశైవ భక్తులు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వీరశైవ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


