విజ్ఞాన్స్‌లో ఆకట్టుకున్న ‘జెనెక్స్–2026’
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘జెనెక్స్–2026’ పేరుతో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన నమూనా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం ‘ది ప్యూచర్ ఆఫ్ హెచ్‌ఆర్, ఏఐ డ్రివెన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్’పై నిర్వహించిన సెమినార్‌లో హైదరాబాద్‌లోని మోస్‌చిప్ టెక్నాలజీస్ టాలెంట్ ఆక్విజిషన్ మేనేజర్ జె. కోమలి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఏఐ డేటా ఆధారంగా ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనమని వివరించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్ కోఆర్టినేటర్ ఎస్‌ఎం సయ్యద్, ఆయా విభాగాల డీన్‌లు, హెచ్‌ఓడీలు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


