గుండెపోటుతో రైతు మృతి
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన రైతు యలమకంటి అంతయ్య(70) శనివా రం తన వ్యవసాయం పొలం వద్ద గుండెపోటుతో మృతిచెందాడు. పొలం వద్ద బోరు మోటారు పైపులు సరిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతయ్య భౌతికకాయానికి డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్‌గౌడ్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి తదితరులు నివాళులర్పించారు.
చదువులో వెనుకబడ్డానని..
ఫ ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
తిప్పర్తి : చదువులో వెనుకబడ్డానని మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశరాజుపల్లి గ్రామానికి చెందిన కత్తుల వర్షిణి(16) చదువులో వెనుకబడి రెండు సంవత్సరాల క్రితం చదువు మానేసింది. ఇంటి వద్దనే ఉంటున్న ఆమె తనకు చదువు సరిగా రావడం లేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కత్తుల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ లింగయ్య తెలిపారు.
వృద్ధురాలి ఒంటిపై
బంగారం చోరీ
నడిగూడెం : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో శనివారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాపురం గ్రామానికి చెందిన పందిరి అనసూర్యమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తి శనివారం అనసూర్యమ్మ ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి మెడలో ఉన్న 10 గ్రాముల నల్లపూసల బంగారు తాడు, చెవులకు ఉన్న పావు తులం చెవిదిద్దులను లాక్కోని పారిపోయారు. ఈ ఘటనలో బాధితురాలి చెవికి స్వల్ప గాయమైంది. బాధితురాలి కుమార్తె కట్ల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
కోదాడ రూరల్: పట్టణంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కోదాడ పట్టణ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పురుషులను, ఒక మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.


