ఆటోను ఢీకొట్టిన కళాశాల బస్సు
కోదాడరూరల్ : మిరపకాయలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ స్టేజీ వద్ద గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కూలీలు చింతలపాలెంలో మిరపకాయలు కోసేందుకు ఆటోలో వెళ్తున్నారు. మార్గమధ్యలో గణపవరం గ్రామ స్టేజీ వద్దకు రాగానే.. మేళ్లచెరువు నుంచి వస్తున్న అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వనకూరి సావిత్రమ్మ, వసంత, మంద రేణుక, నాగమణి, మంద సుకణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లారు. ఆటో డ్రైవర్ మంద రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.
ఫ ఐదుగురు కూలీలకు గాయాలు


