రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని 7 హోటల్ ఎదురుగా హైవేపై సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బూడిద రంగు ప్యాంట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70187 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.
నాటు వైద్యం వికటించి..
భువనగిరిటౌన్ : నాటు వైద్యం వికటించి ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన గురువారం భువనగిరి పట్టణంలో వెలుగు చూసింది. పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన వల్లాల శ్రీనివాస్ కొంతకాలంగా భువనగిరి పట్టణంలోని రామ్‌నగర్‌లో కుటుంబతో కలిసి నివాసముంటున్నాడు. అతడి కుమార్తె సిరి(18) ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 15న నాటు వైద్యం పేరిట చెట్టు మందు తాగించారు. మందు వికటించి సిరి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొంతుదూ..
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడేనికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ(65) ఈ నెల 22న చిట్యాల నుంచి తెలిసినవారి బైక్‌పై శివనేనిగూడేనికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి కిందపడిపోయిన పిచ్చమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో
ఇద్దరికి జైలుశిక్ష
సూర్యాపేటటౌన్ : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ గురువారం సూర్యాపేట కోర్టు ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించారు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి 4 రోజులు, మరొకరికి 2 రోజుల జైలుశిక్షతో పాటు రూ.2,500 చొప్పున జరిమానా, మరో ఇద్దరికి కలిపి రూ.3,000 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.


