చోరీకి పాల్పడిన దొంగ అరెస్టు
కొండమల్లేపల్లి : తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను గురువారం కొండమల్లేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 12న అర్ధరాత్రి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వాసవీ బజారులో నివాసముంటున్న కనుమూరి నాగరాజు ఇంటి తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బీరువాలోని రూ.67,000 నగదు ఎత్తుకెళ్లారు. మరుసటిరోజు నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ అజ్మీరా రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం కొండమల్లేపల్లి చౌరస్తాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. వాసవీ బజారుకే చెందిన ఎస్‌కే బాబా పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా నాగరాజు ఇంట్లో రూ.67,000 నగదు తానే అపహరించినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఎస్‌కే బాబాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


