నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో
మోత్కూరు : భూ తగాదాల కారణంగా వదిన గొంతు కోసిన మరిదితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్తులు గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో వలిగొండ–తొర్రూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలడుగు గ్రామానికి చెందిన బొంత వెంకటలక్ష్మికి, ఆమె మరిది బొంత అశోక్ మధ్య కొంతకాలంగా భూ తగాదాలు కొనసాగుతుండగా.. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో అశోక్ తన వదినపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని గ్రామస్తులు, బంధువులు ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి సమస్య పరిష్కరిస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. వెంకటలక్ష్మి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. స్థానిక సర్పంచ్ అంతటి భగవంతు బాధితురాలి బంధువులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితులను పట్టుకొని తగిన న్యాయం చేస్తామని ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. భూ తగాదాలో పెద్ద మనుషుల పాత్రపై కూడా విచారించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


