తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారం,
రూ.లక్ష నగదు అపహరణ
దేవరకొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి గ్రామానికి బొడ్డుపల్లి శంకరయ్య ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు శంకరయ్య ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం శంకరయ్య హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పోలీసులు నమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు.
చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్పీ
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని మల్లికార్జున్ స్కూల్ సమీపంలో శనివారం రాత్రి దొంగతనం జరిగిన ఇంటిని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ పరిశీలించారు. చోరీ వివరాలను ఇంటి యజమాని లింగంపల్లి నర్సింహను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంట్లో దాచిన రూ.22 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. భారీ మొత్తంలో నగదును ఇంట్లో పెట్టి ఊరెళ్లడం సరికాదన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు దారితీస్తాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ తదితరులు ఉన్నారు.
అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దురాజ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లబండ కాలనీకి చెందిన పల్లపు రాజు(35) వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతడు ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ను వివరణ కోరగా తమకు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ


