ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సందేహాల నివృత్తికి
టోల్ ఫ్రీనంబర్ 14416
భువనగిరి: ‘ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా వసతుల కల్పనతో పాటు పట్టిష్టమైన చర్యలు చేపట్టాం. ఈ సారి నిమిషం నిబంధనను సడలించారు. సరైన కారణం చూపితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తాం’ అని డీఐఈఓ రమణి వెల్లడించారు. ఈనెల 25నుంచి మార్చి 18వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సోమవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఇంటర్ పరీక్షలకు 28 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ సారి 12,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరంలో 6,550, ద్వితీయ సంవత్సరంలో6,263 మంది విద్యార్థులున్నారు.
పరీక్షల నిర్వహణకు కమిటీ ఏర్పాటు
పరీక్షల నిర్వహణకు 28 మంది సీఎస్‌లు, 28 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, వీరితో పాటు డీఈసీ కమిటీ ఏర్పాటు చేశాం. ఇందులో కన్వీనర్‌గా డీఐఈఓ పాటు సభ్యులుగా మంజుల, రవీందర్‌ను నియమించాం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి కేంద్రానికి ఒక సిటింగ్ స్క్వాడ్‌ను నియమించాం.
ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రంలోకి..
విద్యార్థులు తప్పనిసరిగా ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలో వారికి కేటాయించిన సీట్లో కూర్చుకోవాలి. ఆలస్యానికి సరైన కారణం చూపి ఉదయం 9.05 గంటల వరకు వస్తే అనుమతిస్తాం. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు కేంద్రంలోకి అనుమతించడం ప్రారంభిస్తారు.
పరీక్ష గదిలో గోడ గడియారం ఏర్పాటు చేశాం
పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. కేంద్రంలోని పరీక్ష గదిలో ప్రత్యేకంగా గోడ గడియారం ఏర్పాటు చేశాం. కాబట్టి విద్యార్థులు వాచ్‌లు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లు సైతం కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రానికి వచ్చే క్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్‌ను వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతవాతావరణంలో పరీక్ష రాయాలి.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఒక్కో కేంద్రంలో సుమారు 5 నుంచి 6 సీసీ కెమెరాలుంటాయి. ఈ కెమెరాలన్నీ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. ప్రశ్న పత్రాల జారీ నుంచి పరీక్ష ముగిసే వరకు తరచూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
నేరుగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా ఇంటర్‌బోర్డు చర్యలు తీసుకుంది. విద్యార్థుల ఫోన్‌కు వచ్చిన పోర్టల్ ద్వారా ప్రథమ సంవత్సరం విద్యార్థులైతే పదోతరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులైతే ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు.
ప్రతి కేంద్రంలో నీటి వసతితో పాటు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉన్నతాధికారులు ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న క్రమంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి సమస్య, సందేహం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఫ హాజరుకానున్న 12,813 మంది విద్యార్థులు
ఫ డీఐఈఓ రమణి
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి


