విద్యార్థినులకు అస్వస్థత
భువనగిరి: భువనగిరి పట్టణంలోని కేజీబీవీలో సోమవారం విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కేజీబీవీకి తాజాగా కొత్త బియ్యం సరఫరా కావడం.. దానితో చేసిన కిచిడీని ఉదయం విద్యార్థినులకు వడ్డించారు. కిచిడీ తిన్న విద్యార్థినుల్లో ముగ్గురు అస్వస్థతకు గురి కావడంతో అందులోని వైద్య సిబ్బంది పరిశీలించి స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి చికిత్స అందించిన అనంతరం తిరిగి పాఠశాలకు పంపించారు. ఈ విషయం పై డీఈఓ సత్యనారాయణను వివరణ కోరగా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురి కాలేదని కిడ్నీలో స్టోన్స్ వల్ల కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి సిబ్బంది తీసుకెళ్లారని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు సైతం కిడ్నీలో స్టోన్స్ సమస్య వల్లనే విద్యార్థినులకు నొప్పి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది.
నేడు జాబ్ మేళా
భువనగిరి: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో 100 పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత కలిగినవారు బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో హాజరు కావాలని కోరారు.
భీమనపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని భీమనపల్లిలో మార్చి1 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి వెల్లడించారు. సోమవారం భీమనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుసభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామ యువకుల వినతి మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మే బెల్టు షాపులకు నోటీసులు అందజేస్తామన్నారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఉపసర్పంచ్ గంగదేవి గురవయ్య, వార్డుసభ్యులు కందాడి సత్తిరెడ్డి, సిల్వేరు శేఖర్, ఉపునూతుల రమణమ్మశ్రీశైలం, ఈరటి సునిత మల్లేశం, వల్లం రాణి బాలయ్య, ఉపునూతుల లింగస్వామి, బూరుగు కవిత సంతోష్, కలకుంట్ల రమేశ్, చెక్క సుధాకర్ పాల్గొన్నారు.
ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్ లాగ్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వినూత్నంగా వివిధ క్రీడాంశాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోర్సును ప్రవేశ పెట్టినట్లు వ్యాయామ అధ్యపకులు మురళి, వై.శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ప్రధాన క్రీడాంశాలు, వాటి విధివిధానాలు పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వాలీబాల్‌పై అవగాహన కల్పనతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సును అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు.


