ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం
నకిరేకల్ : ఆటోమొబైల్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిబూడిదయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన జ్వాల ఉపేందర్ స్థానిక సాయి మందిరం సమీపంలో సాయి విఘ్నేష్ ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే బైక్ రిపేర్ దుకాణం కూడా నడుపుతున్నాడు. ఉపేందర్ రోజుమాదిరిగానే శనివారం ఉదయం తన సతీమణిని ఆటోమొబైల్ షాపులో ఉంచి పక్కన ఉన్న బైక్ మెకానిక్ షాపులో బైక్‌లు రిపేర్ చేస్తున్నాడు. మధ్యాహ్నం ఉపేందర్ భార్య భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేటనికే ఆటోమొబైల్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పక్కన బైక్‌లు రిపేర్ చేస్తున్న ఉపేందర్ బయటకు వచ్చి ఆటోమొబైల్ షాపులోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. మంటలు బయటకు వ్యాపించడంతో పక్కన షాపుల వారు తమ షట్టర్లును బంద్ చేసి రోడ్డు మీదకు పరుగులు పెట్టారు. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫర్నీచర్‌తో పాటు ఆయిల్ డబ్బాలు, బైక్ స్పేర్ పార్ట్స్ మంటల్లో కాలిబూడిదయ్యాయి. రూ.50లక్షల పైనే నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ తహసీల్దార్ యశ్వంత్ సందర్శించి వివరాలు సేకరించారు.
సర్వం కోల్పోయాం..
తన పెద్ద కుమారుడు ఫీజు కోసం తెచ్చిన రూ.3లక్షల నగదు, ప్లాట్లు, భూమి డాక్యుమెంట్స్ క్యాష్ కౌంటర్‌లో పెట్టానని, అవన్నీ కాలిబూడిదయ్యాయని షాపు యజమాని జ్వాల ఉపేందర్ తెలిపాడు. తాను సర్వం కోల్పోయానని బోరున విలపించాడు.
ఫ రూ.50 లక్షలకు పైగా నష్టం
వాటిల్లిందని బాధితుడి ఆవేదన


